తెలుగు తేజం, మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి సిఫారసు చేసింది బ్యాడ్మింటన్ అసోసియేషన్. ఒకే ఏడాదిలో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్‌ను భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ క్రమశిక్షణ నియామవళి ప్రకారం గతంలో ఖేల్‌రత్న అవార్డుకు సిఫారసు చేయలేదు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో మనీలాలో ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆడాలని సూచించినా.. బార్సిలోనాలో మరో టోర్నీలో పాల్గొనేందుకు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణోయ్ మనీలా వీడారు. 

సూచనలు విస్మరించిన శ్రీకాంత్‌,ప్రణోయ్ లను క్రమశిక్షణ ఉల్లంఘన కింద క్రీడా అవార్డులకు సిఫారసు చేయలేదు. దీంతో హెచ్‌.ఎస్‌ ప్రణోయ్ భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్ తీరుపై భగ్గుమన్నాడు. 'ఆసియా గేమ్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన షట్లర్‌ వరుసగా రెండో ఏడాది అవార్డుకు సిఫారసు కాలేదు. కానీ ఏ ఈవెంట్‌లోనూ మెడల్‌ కొట్టని ఆటగాడు అవార్డుకు సిఫారసు చేయబడ్డాడు' అని సమీర్‌ వర్మను ఉద్దేశించి హెచ్‌.ఎస్‌ ప్రణోయ్ విమర్శలు గుప్పించాడు. 

ఆసియా చాంపియన్‌షిప్స్‌ సెమీఫైనల్స్‌లో ఆడనందుకు కిదాంబి శ్రీకాంత్‌ బారుకు క్షమాపణలు తెలిపాడు. అందుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ బారుకి లేఖ రాశాడు. ' కిదాంబి శ్రీకాంత్‌ బారుకి క్షమాపణలు తెలిపాడు. శ్రీకాంత్‌ సాధించిన విజయాలను గమనంలో ఉంచుకుని అతడిని ఖేల్‌రత్న పురస్కారానికి సిఫారసు చేస్తున్నాం. క్రమశిక్షణ నియామవళి ఉల్లంఘించిన ప్రణోయ్ కి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నాం. 15 రోజుల్లో ప్రణరు సంజాయిషీ ఇవ్వాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు' అని బారు ప్రకటనలో తెలిపింది.