ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే కాఫీ విత్ కరణ్ షో మూలంగా ఇద్దరు యువ క్రికెటర్లు వివాదాలను కొనితెచ్చుకున్న విషయం తెలిసిందే. మంచి ఆటతీరుతో అప్పుడప్పుడే జట్టులో కీలక ఆటగాడిగా మారుతున్న హార్ధిక్ పాండ్యా, మరో ఆటగాడు రాహుల్ ఈ షో ద్వారానే బిసిసిఐ నిషేదానికి గురవ్వాల్సి వచ్చింది. ఆ షోలో పాండ్యా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇంకా అక్కడక్కడ వివాదాలు రేగుతూనే వున్నాయి. దీంతో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొనడం కాదు కదా...ఆ పేరు చెబితేనే క్రికెటర్లు భయపడే పరిస్థితి ఏర్పడింది.

కానీ టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ షో పై ఫాజిటివ్ కామెంట్స్ చేశారు. ఆ షోలో పాల్గొనే అవకాశం వస్తే తాను వదులుకోనంటూ సంచలన ప్రకటన చేశారు. ఓ అభిమాని అశ్విన్ ను ఇన్స్‌స్టాగ్రామ్ లో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొనే అవకాశం వస్తే మీరేం  చేస్తారని ప్రశ్నించాడు. దీనికి అశ్విన్ అస్సలు వదులుకోనంటూ సమాధానమిచ్చాడు. 

హార్ధిక్ పాండ్యా ఈ షోలో మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అతడితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేఎల్.రాహుల్ కూడా రెండు వన్డేల నిషేధాన్ని ఎదుర్కొన్నారు. అయితే బిసిసిఐ వీరిపై నిషేధాన్ని తొలగించినా ఆ ప్రభావం మాత్రం వీరిద్దరి కెరీర్లపై పడింది. ఈ నేపథ్యంలో ఇకపై మిగతా క్రికెటర్లేవరూ ఈ షోలో పాల్గొనే సాహసం చేయరని అందరూ భావిస్తుండగా తాజాగా అశ్విన్ వ్యాఖ్యలు అందుకు విరుద్దంగా వున్నాయి.