ఐపీఎల్ 12వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ధోని సేన ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. 

కోల్‌కతా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన యువ బౌలర్‌ దీపక్‌ చహర్‌ 3 వికెట్లు తీసి.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  దక్కించుకోగా.. సీనియర్‌ ఆటగాళ్లు హర్భజన్‌, తాహిర్‌ రెండేసి వికెట్లు తీసి అతడికి అండగా నిలిచారు.ఈ నేపథ్యంలో హర్భజన్,తాహిర్ లపై ప్రశంసల వర్షం కురిపించాడు.

 ‘వయస్సు గురించి పక్కన పెడితే వారిద్దరు వైన్‌లా రోజు రోజుకీ పరిణతి చెందుతున్నారు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో భజ్జీ మెరుగ్గా రాణించాడు. తాహిర్‌ కూడా గొప్పగా ఆడుతున్నాడు. నిజానికి మా బౌలర్లు ప్రతీ మ్యాచులో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫ్లాటర్‌ వికెట్‌ ఉన్నపుడు బాగా ఆలోచించి కాంబినేషన్స్‌ సెట్‌ చేయాల్సి ఉంటుంది. తాహిర్‌ నన్ను పూర్తిగా నమ్ముతాడు. ఎక్కడ బంతి వేస్తే ఫలితం మెరుగ్గా ఉంటుందో చెప్పినపుడు తను తప్పకుండా అలాగే చేస్తాడు. తద్వారా చాలాసార్లు మంచి ఫలితాలు రాబట్టాం’ అని ధోని చెప్పుకొచ్చాడు.