శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ వన్డే మ్యాచ్ లకు వీడ్కోలు పలకునున్నారు. శ్రీలంక వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి మ్యాచే... మలింగకు ఆఖరి మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆయన వన్డేలకు గుడ్ బై చెప్పనున్నారు. కాగా... దీనిపై శ్రీలంక కెప్టెన్ కరుణ రత్నె స్పందించారు.

ఈ మ్యాచ్ లో తమ జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో విజయం తర్వాత మలింగకు ఘన వీడ్కోలు పలుకుతామని చెప్పారు. ఈ మ్యాచ్ విజయం సాధించడమే మలింగకు తాము ఇచ్చే గొప్ప కానుకగా ఆయన పేర్కొన్నారు.

మరోవైపు బంగ్లాదేశ్‌ సారథి తమీమ్‌ ఇక్బాల్‌ కూడా మలింగ ప్రదర్శనను కొనియాడాడు. మలింగ ఆటకు గొప్ప అంబాసిడర్‌ అని, అతని ఆట చూసే చాలా మంది యువ ఆటగాళ్లు క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టారని తమీమ్‌ చెప్పుకొచ్చాడు.ఇప్పటిదాకా 225 వన్డేలు ఆడిన లసిత్‌ 335 వికెట్లు పడగొట్టాడు. లంక తరఫున మురళీధరన్‌(523), చమిందా వాస్‌(399) తర్వాత అత్యధిక వికెట్ల ఘనత మలింగదే.