వరస విజయాలతో దూసుకువెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవి చూసింది. ఈ మ్యాచ్ కి కెప్టెన్ ధోని అందుబాటులో లేకపోవడంతో.. తాత్కాలిక కెప్టెన్ గా సురేశ్ రైనా బాధ్యతలు స్వీకరించాడు. అయితే.. రైనా కెప్టెన్సీ విఫలం కారణంగానే మ్యాచ్ పోయిందనే విమర్శలు వినపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో తమ ఓటమిపై రైనా స్పందించాడు. ‘‘నాకు తెలిసి ఇది మాకు మంచి మేలుకొలుపు వంటిది. మేం మంచి లక్ష్యాన్ని నిర్ధేశించలేదు. త్వరత్వరగా వికెట్లు కోల్పోయాం. ఫాఫ్‌, వాట్సన్‌ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మేం దాన్ని అందిపుచ్చుకోలేకపోయాం. మేం త్వరగా వికెట్ల కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మేం భాగస్వామ్యాలపై దృష్టిసారించాల్సింది. స్ట్రైక్‌రేట్‌ గొప్పగా రొటేట్‌ చేయాల్సింది. మేం 30 పరుగులు తక్కువగా చేశాం. ఇక ధోని కెప్టెన్‌గా ఉంటేనే బాగుంటుంది. అతను గాయం నుంచి కోలుకున్నాడు. మరసటి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు.’ అని రైనా చెప్పుకొచ్చాడు

ధోని ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని రైనా కూడా ఒప్పుకోవడం గమనార్హం. వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్ కి ధోనీ దూరమయ్యారు. తరువాతి మ్యాచ్ లో ధోనీ తిరిగి పాల్గుంటారు.