స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ధనాధన్ బ్యాటింగ్ తో ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట వున్న రికార్డును బద్దలుకొట్టాడు. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో వార్నర్ 47 పరుగులు బాదాడు. దీంతో ఐపిఎల్ లో ఐదువేల పరుగులను పూర్తిచేసుకున్నాడు. 

ఈ క్రమంలోనే వార్నర్ సరికొత్త రికార్డును సాధించాడు. ఐపిఎల్ లో ఐదువేల పరుగులను పూర్తిచేసుకున్న మొదటి విదేశీ ఆటగాడిగా నిలవడమే కాకుండా కోహ్లీ పేరిట వున్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు అతి తక్కువ ఇన్నింగ్సుల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న ఘనత కోహ్లీ పేరిట వుండగా అదిప్పుడు వార్నర్ పేరుపైకి మారింది. కోహ్లీ 157 ఇన్సింగ్సుల్లో ఐదువేల పరుగులు సాధించగా వార్నర్ కేవలం 135 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించాడు. 

అయితే ఇప్పటివరకు 5,759 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా సురేష్ రైనా 5468పరుగులతో రెండో స్థానంలో నిలిచారు. ముంబై కెప్టెన్  రోహిత్ 5149 పరుగులతో మూడో స్థానంలో వుండగా ఆ తర్వాతి స్థానంలో వార్నర్ నిలిచాడు. ఇక విదేశీ ఆటగాళ్లలో ఐదువేల పరుగుల మైలురాయిని చేరుకున్నమొదటి ఆటగాడికి వార్నర్ నిలవగా డివిలియర్స్ 4680 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.