స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జాతీయ జట్టుకు దూరమైన శ్రీశాంత్ ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. జీవితకాల నిషేధానికి గురైన అతడికి బీసీసీఐ అంబుడ్స్ మన్ డీకే జైన్ శిక్షను ఏడేళ్లకు కుదిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు..  ఇప్పటికే ఆరేళ్ల పాటు నిషేధం పూర్తి చేసుకున్న శ్రీశాంత్ కి 2020 ఆగస్టులో శిక్షా కాలం ముగుస్తుంది. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడాడు.

తనపై విధించిన జీవితకాల శిక్షను ఏడేళ్లకు కుదిస్తూ... సుప్రీం కోర్టు, బీసీసీఐ అంబుడ్స్ మన్  తీసుకున్న నిర్ణయం పట్ల అతను హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టుకు, బీసీసీఐకు  దన్యవాదాలు తెలిపాడు.  తన కోసం దేవుడి ప్రార్థించిన తన శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా శ్రీశాంత్ దన్యవాదాలు తెలిపారు. 

ఇప్పుడు తన వయసు 36ఏళ్లు అని.. వచ్చే ఏడాదితో శిక్షకాలం ముగుస్తుందని చెప్పాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 87వికెట్లు పడగొట్టానని.. 100 వికెట్లు తీసి తన కెరిర్ ని ముగించాలనుకుంటున్నట్లు శ్రీశాంత్ వివరించారు. టీం ఇండియాలో తిరిగి స్థానం దక్కించుకుంటాననే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. విరాట్ కోహ్లీ  సారథ్యంలో క్రికెట్ ఆడాలని ఉందని చెప్పాడు. 

‘40 ఏళ్ల దగ్గరిలో ఉన్న శ్రీశాంత్ క్రికెట్‌ కెరీర్‌ ఇప్పటికే ముగిసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అతడి శిక్ష కాలం ఏడేళ్లకి తగ్గించాం. 2013లో అతడు నిషేధానికి గురైన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని జైన్‌ తెలిపారు. ఐపీఎల్‌లో ఒక ఓవర్లో ఉద్దేశపూర్వకంగా 14 పరుగులు ఇచ్చినందుకు రూ.10 లక్షలు తీసుకున్నాడని శ్రీశాంత్‌పై ఆరోపణ ఉంది. కాగా 2013లో శ్రీశాంత్ తోపాటు  అంకిత్ చవాన్, అజిత్ చండీలాలపై కూడా జీవితకాల నిషేధం విధించారు.