జపాన్ కరోనా వైరస్ ఆంక్షలను సడలించిన తర్వాత 5 వేల మందికి పైగా ప్రేక్షకులు నిప్పన్ ప్రొఫెషనల్ బేస్‌బాల్, జే లీగ్ మ్యాచ్‌లకు హాజరయ్యారు. ఈ రెండు ప్రొఫెషనల్ లీగ్‌లు ప్రేక్షకుల సంఖ్యను పెంచాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. వారి విజ్ఞప్తి మేరకు జూలై 10 నుంచి గరిష్టంగా 5,000 మంది ప్రేక్షకులు హాజరయ్యేందుకు అనుమతించింది.

అయితే 20,000 మంది ప్రేక్షకులు లేదా స్టేడియం సామర్ధ్యంలో 50 శాతం ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని అంగీకరించాలని నిర్వాహకులు కోరారు. కాగా యోకోహామా స్టేడియంలో యోకోహామా డీఎన్ఏ బేస్టార్స్, యోమియురి జెయింట్స్ మధ్య శనివారం జరిగిన బేస్‌బాల్ మ్యాచ్‌కు 13,106 మంది ప్రేక్షకులు హాజరైనట్లు క్యోడో న్యూస్ కథనాన్ని ప్రచురించింది.

కరోనా వైరస్ మహమ్మారి జపాన్‌పై విరుచుకుపడిన తర్వాత ఓ బేస్‌బాల్ మ్యాచ్‌కు 10000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు  హాజరవ్వడం ఇదే తొలిసారి. దీంతో 34,000 సీటింగ్ సామర్ధ్యం వున్న యోకోహామా స్టేడియంలో బేస్టార్స్ తమ ప్రేక్షకుల సంఖ్యను 16,000కు పెంచింది.

ఇదే సమయంలో టోక్యో డోమ్‌లో జెయింట్స్ తన సామర్ధ్యాన్ని  19,000కు పెంచుకోగా, టోక్యో యాకుల్ట్ స్వాలోస్ మధ్య జరిగే మ్యాచ్‌లో 14,500 మందికి అనుమతి ఉంటుందని భావిస్తున్నారు.

జపాన్‌లో అగ్రశ్రేణి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న జే లీగ్‌లో నాగోయా గ్రాంపస్- విస్సెల్ కోబే మధ్య జరిగిన మ్యాచ్‌లో 11,854 మంది హాజరయ్యారు. మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో టోక్యో ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. జపాన్‌లో ఇటీవలి కాలంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. నిన్న టోక్యోలో 218 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో జపాన్ ప్రభుత్వం, టోక్యో మెట్రోపాలిటిన్ అడ్మినిస్ట్రేషన్, టోక్యో 2020 ఆర్గనైజింగ్ కమిటీ అధికారులతో ఏర్పడిన కరోనా వైరస్ కౌంటర్ మెజర్స్ టాస్క్‌ఫోర్స్ ‌ 2021 జూలై 23 నుంచి 2021 ఆగస్టు 23 వరకు ఒలింపిక్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

అదే ఏడాది ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారాలింపిక్స్‌ జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు. మరోవైపు ప్రయాణ పరిమితుల నుంచి అథ్లెట్లను మినహాయించే ప్రతిపాదనను ప్రభుత్వం బుధవారం ఆమోదించే అవకాశం వుంది. కరోనా నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం విదేశీయుల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో ఆయా దేశాల ప్రజలు జపాన్‌కు వెళ్లలేకపోతున్నారు.