టీమిండియా మాజీ క్రికెటర్  గౌతమ్‌ గంభీర్‌ రికార్డును యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్ బ్రేక్ చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతిపిన్న వయస్సులో డబుల్‌ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. వెస్టిండీస్‌-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శుబ్‌మన్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. కాగా 2002లో జింబాబ్వేతో జరిగిన బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ టెస్టులో గంభీర్‌ ద్విశతకం సాధించాడు. అప్పుడు అతడి వయస్సు 20 ఏళ్ల 124 రోజులు.

 ఇక ట్రినిడాడ్‌లోని బ్రియన్‌ లారా స్టేడియంలో జరగిన మూడో టెస్టులో శుబ్‌మన్‌ 19 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల 334 రోజుల వయస్సులో టెస్టుల్లో ద్విశతకం(204) సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇక గురువారం నాటి మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌ కుప్పకూలినప్పటికీ శుబ్‌మన్‌ నిలకడగా ఆడాడు. కెప్టెన్‌ హనుమ విహారీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది 315 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన శుభ్‌మన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో చక్కగా ఆడాడు.

 కాగా వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన శుభ్‌మన్‌ గిల్‌ జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కుతుందని ఆశించి భంగపడిన సంగతి తెలిసిందే. విండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కుతుందని ఆశించానని, అయితే అది జరగకపోవడంతో నిరాశకు గురైనట్లు పేర్కొన్నాడు. మరోవైపు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరగాల్సిన తొలి వన్డే వరణుడి కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.