టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశభక్తికి వెస్టిండీస్ క్రికెటర్ కాట్రెల్ ఫిదా అయ్యారు. వచ్చే నెలలో టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా... ఈ పర్యటనకు ధోనీని ఎంపిక చేస్తారా లేదా అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ధోనీ స్వచ్ఛందంగా ఈ పర్యటనకు దూరంగా ఉంటూ... రెండు నెలల పాటు భారత ఆర్మీలో సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

ధోనీ తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పటికే పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించగా... తాజాగా ఈ విషయంపై వెస్టిండీస్ క్రికెటర్ కాట్రెల్ ఈ జాబితాలో చేరాడు. ధోనీ దేశభక్తికి సెల్యూట్ చేశాడు. ఈ సందర్భంగా గతేడాది ధోనీ రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్ అందుకుంటున్న వీడియోని కూడా జత చేశాడు.

‘‘ మైదానంలో ధోనీ ఎంతో స్ఫూర్తినిస్తాడు. అతను గొప్ప దేశ భక్తుడు. దేశానికి సేవలందించాలన్న అతని అంకిత భావం అమోఘం’ అంటూ కాట్రెల్ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్ లో ‘‘ ఈ వీడియోని స్నేహితులు, కుటుంబసభ్యులకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అలాంటి క్షణాన్ని నేను ఎంత గర్విస్తానో వాళ్లకి తెలుసు. ఆ క్షణంలో ధోనీ భార్య సాక్షిని చూస్తేంటే జీవిత భాగస్వామిపై, దేశం పట్ల ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది’ అంటూ ధోనీ పద్మవిభూషణ్ అందుకునే వీడియోని షేర్ చేశాడు.

కాగా.. ధోనీపై కాట్రెల్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ధోనీపై అతను చూపించిన అభిమానానికి ఇండియన్ అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. మైదానంలో కాట్రెల్ కి ప్రతి విషయంలో సెల్యూట్ చేయడం అలవాటు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘మైదానంలో నువ్వు సెల్యూట్ తో సంబరాలు చేసుకుంటే... నీ ట్వీట్ కి, మంచితనానికి మేమందరం సెల్యూట్ చేస్తున్నాం’ అంటూ నెటిజన్లు మెసేజ్ లు పెడుతున్నారు.