Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్‌లో బోణీ కొట్టిన భారత్... వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సాగర్‌కి రజతం...

55 కేజీల విభాగంలో రజతం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సాగర్... గాయమైనా పట్టించుకోకుండా పోటీలో నిలిచి...

Sanket Sargar wins 1st medal for India at Birmingham Commonwealth Games
Author
Birmingham, First Published Jul 30, 2022, 3:57 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ బోణీ కొట్టింది. 55 కేజీల పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరిలో పోటిపడిన భారత వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సాగర్, రజత పతకం సాధించాడు. 21 ఏళ్ల సంకేత్ మహదేవ్ తండ్రి ఓ పాన్ షాప్ యజమాని కావడం విశేషం. 

స్కాచ్ కేటగిరిలో 113 కేజీలను ఎత్తిన సంకేత్, సీ అండ్ జే ఈవెంట్‌లో 135 కేజీలను ఎత్తి... ఓవరాల్‌గా 248 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్‌ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భారత్‌కి ఇది 49వ రజతం. మలేషియాకి చెందిన మహ్మద్ అనీక్, 249 కేజీలతో టాప్‌లో నిలిచి స్వర్ణం సాధించాడు. రెండో స్థానంలో నిలిచిన సంకేత్‌కి, అనీక్‌కి మధ్య తేడా కేవలం ఒక్క కేజీ మాత్రమే... 

వెయిట్ లిఫ్టింగ్ చేసే సమయంలో సంకేత్, మోచేతి ఎముక బెణికింది. అయినా భారత్‌కి పతకం తేవడమే లక్ష్యంగా పోటీని పూర్తి చేసిన సంకేత్, మోచేతికి కట్టుతో మెడల్ అందుకున్నాడు.. ఓవరాల్‌గా వెయిట్‌లిఫ్టింగ్‌లో 126 పతకాలు సాధించింది భారత్. షూటింగ్‌లో 135 పతకాలు సాధించిన భారత షూటర్లు, ఈ లిస్టులో టాప్‌లో ఉన్నారు. 

మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్‌ సభ్యులు మానికా బత్రా, రీత్ టెన్నిసన్, శ్రీజ అకుల, దియా చితలా... గుయనాతో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో ఘన విజయాన్ని అందుకుని క్వార్టర్ ఫైనల్స్‌కి దూసుకెళ్లారు. 

అలాగే అథ్లెటిక్స్‌ మెన్స్ మారథాన్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ నితేందర్ సింగ్ రావత్, 12వ స్థానంలో నిలిచాడు. 2 గంటల 19 నిమిషాల 22 నిమిషాల వ్యవధిలో పరుగును ముగించిన నితేందర్, 8 నిమిషాల 27 సెకన్ల తేడాతో లీడర్‌ బోర్డును మిస్ అయ్యాడు.. 

భారత పురుషుల స్విమ్మింగ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో 21 ఏళ్ల శ్రీహరి నటరాజ్, సెమీ ఫైనల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కి దూసుకెళ్లాడు.  కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఫైనల్ చేరిన మూడో భారత స్విమ్మర్‌గా నిలిచాడు శ్రీహరి. ఇంతకుముందు  2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్విమ్మర్లు  సందీప్ సెజ్వాల్, విరాద్వాల్  కాదే ఫైనల్ చేరినా పతకం మాత్రం సాధించలేకపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios