టీమిండియా నూతన బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోర్ ఎంపికయ్యారు. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్.శ్రీధర్‌కే బీసీసీఐ పట్టం కట్టింది. టీమిండియా సహాయక సిబ్బంది నియామకం కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. 

చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సరన్‌దీప్ సింగ్, గంగన్ ఖోడా, జతిన్ పారాజపే పాల్గొనగా.. మరో సభ్యుడు దేవాంగ్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వీరంతా కలిసి బంగర్ ని కాదని.... విక్రమ్ రాథోర్ ని ఎంపిక చేశారు. కాగా... బంగర్ ని ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని ఓ ప్రముఖ పత్రిక ఇటీవల ప్రచురించింది.

ఆ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం... ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో బంగర్ సెలక్టర్స్ గదిలోకి దూసుకు వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా సెలక్షన్ బృందాన్ని కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. అందుకే బంగర్ ని బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయనట్లు సమాచారం. 

ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో దేవాంగ్ గాంధీ గదికి బంగర్ వెళ్లినట్లు సమాచారం. తనను మళ్లీ బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకపోతే.. తన మద్దతు దారులు ఆందోళన చేస్తారంటూ బంగర్ సెలక్షన్ కమిటీని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని ప్రవర్తన పట్ల విసిగిపోయిన సెలక్షన్ కమిటీ అతనిని పక్కన పెట్టేసినట్లు ఆ వార్త పత్రిక కథనాన్ని ప్రచురించింది. మరి దీనిపై బంగర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.