కోల్‌కతా: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మక జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను టెండుల్కర్ తిరస్కరించారు. ఈ ఏడాది డిసెంబర్ 24న యూనివర్శిటీ 63వ స్నాతకోత్సవం సందర్భంగా సచిన్ కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్టు గతంలో యూనివర్సిటీ ప్రకటించింది. అయితే తాను డాక్టరేట్‌కు అర్హుడిని కాదని నైతిక విలువలు కారణంగా చూపుతూ వర్సిటీకి సచిన్ లేఖ పంపారు. 

డాక్టరేట్ ను తిరస్కరిస్తూ సచిన్ టెండుల్కర్ పంపిన లేఖ వాస్తవమేనని వర్సిటీ వైస్ చాన్సలర్ సురంజన్ దాస్ తెలిపారు. సచిన్ స్థానంలో ఒలింపిక్ పతక విజేత మేరికోమ్‌ను డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు తెలిపారు యూనివర్శిటీ అధికారులు.

డాక్టరేట్ ను తిరస్కరించడం ఇదే ప్రథమం కాదన్నారు సచిన్. గతంలోనూ తనకు వివిధ యూనివర్సిటీలు ప్రకటించిన డాక్టరేట్లను తిరస్కరించినట్టు లేఖలో సచిన్ పేర్కొన్నారు. ముంబై యూనివర్సిటీ, ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు గతంలో సచిన్‌కు డాక్టరేట్లు ప్రకటించగా తిరస్కరించారు.