Russia Ukraine Crisis: నిషేధాజ్ఞలతో రష్యాకు షాకిస్తున్న క్రీడా ప్రపంచం.. మేజర్ టోర్నీలన్నీ రద్దు
Sports Federations Calls Ban On Russia: ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తూ ఆ దేశాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న రష్యాపై క్రీడా ప్రపంచం తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నది. వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడుతున్నది. అయినా..
సరిహద్దు దేశం ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యాపై క్రీడా ప్రపంచం ధీటుగా స్పందిస్తున్నది. అమాయక ప్రజల ప్రాణాలను తీస్తూ మారణకాండ సాగిస్తున్న రష్యాపై తీవ్ర ఆంక్షలతో పాటు ఆ దేశంలో జరగాల్సి ఉన్న.. భవిష్యత్ లో జరుగబోయే క్రీడలపై నిషేధం విధిస్తున్నది. యుద్ధం ఆపాలని, ఉక్రెయిన్ లో తిరిగి శాంతి స్థాపన చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరుతున్నా.. ఆయన మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఉక్రెయిన్ ను లొంగదీసుకోవడానికి ఎంతదాకనైనా వెళ్తానని మొండి పట్టుదలతో వ్యవహరిస్తూ తీవ్ర విమర్శల పాలవుతున్నారు.
ఇదిలాఉండగా రష్యా వైఖరిపై ప్రపంచ క్రీడా సమాఖ్య భగ్గుమంది. రష్యన్ ఆటగాళ్లపై బహిష్కరణ విధించడమే గాక ఆ దేశంలో జరగాల్సిన క్రీడా ఈవెంట్లపై నిషేధాన్ని విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) తో పాటు ఫిఫా వరల్డ్ కప్, యూఈఎఫ్ఏ, రగ్బీ, ఫిడే చెస్ ఛాంపియన్షిప్, జూనియర్ స్విమ్మింగ్ వరల్డ్ కప్ ఈవెంట్లు రష్యా లో నిర్వహించొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పటివరకు రష్యాలో నిషేధం ఎదుర్కున్న పలు క్రీడా ఈవెంట్లు :
- రష్యా లో జరుగబోయే అన్ని అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లపై ఐవోసీ నిషేధం విధించింది.
- ఐవోసీ ప్రకటన అనంతరం ఫిపా, యూఈఎఫ్ఏ కూడా రష్యా జాతీయ జెండా, జాతీయ గీతాన్ని బహిష్కరించాయి. ఈ ఏడాది జరుగబోయే ఫిఫా ప్రపంచకప్ లో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతున్న రష్యాకు ఇది పెద్ద ఎదురుదెబ్బే.. అంతేగాక ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్ నుంచి రష్యాపై ఫిఫా బహిష్కరణ వేటు వేసింది. ఫిఫా ప్రపంచకప్-2022తో పాటు అన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. ప్రపంచకప్ కు అర్హత సాధించేందుకు గాను రష్యా.. ఈ నెల నుంచి ఖతార్ లో జరుగబోయే క్వాలిఫయింగ్ మ్యాచులు ఆడాల్సి ఉంది.
- ప్రపంచకప్ ప్లే ఆఫ్ సెమీ ఫైనల్ లో తాము రష్యాతో ఆడబోమని పోలండ్ ఎఫ్ఏ ఇంతకుముందే ప్రకటించింది. మార్చి 24న ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.
- ప్రపంచ క్రీడా సమాఖ్యలన్నీ రష్యా, బెలారస్ ఆటగాళ్లపై నిషేధం విధించాలని పలు క్రీడా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- వరల్డ్ చెస్ బాడీ ఫిడే.. రష్యా, బెలారస్ స్పాన్సర్లతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంది.
- ప్రపంచ రగ్బీ క్రీడా సమాఖ్య.. రష్యా, బెలారస్ లపై నిషేధం విధించింది.
- ఈ ఏడాది జరగాల్సి ఉన్న జూనియర్ వరల్డ్ స్విమ్మింగ్, వాలీబాల్ వరల్డ్ ఛాంపియన్షిప్, యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, స్కైయింగ్ వరల్డ్ కప్ ఈవెంట్లు కూడా రష్యా నుంచి తరలిపోయాయి.
- ఉక్రెయిన్ కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి ఎలీనా విటోలినా.. కీలక నిర్ణయం తీసుకుంది. మాంటేరీ ఓపెన్ లో రష్యా క్రీడాకారిణి అనస్థీషియా పోటాపోవాతో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ ఆడబోనని స్పష్టం చేసింది. అంతేగాక తన విజయాలలో వచ్చే నగదును ఉక్రెయిన్ మిలటరీకి విరాళమిస్తున్నట్టు ఆమె ప్రకటించింది.
- ఇక ప్రపంచ తైక్వాండో గౌరవ అధ్యక్షుడిగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆ స్థానం నుంచి తొలగిస్తున్నట్టు వరల్డ్ తైక్వాండో సమాఖ్య నిర్ణయించింది. విజయం కంటే తమకు శాంతి ముఖ్యమని ఒక ప్రకటనలో అది పేర్కొంది.