నైరోబి: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుపాలయ్యాడు రియో ఒలింపిక్స్ పతక విజేత కాన్సలస్ కిప్రుటో. అతడు నేరం చేసినట్లు రుజువైతే టోక్యో ఒలింపిక్స్ దూరమవడమే కాదు 20ఏళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి వుంటుంది. 

కెన్యా స్టార్‌ అథ్లెట్‌ కిప్రుటో స్టీపుల్‌ఛేజ్‌ విభాగంలో రియో ఒలింపిక్స్‌ లో పసిడి పతక విజేతగా నిలిచాడు. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్దమవుతున్న సమయంలో అతడు వివాదంలో చిక్కుకున్నాడు. 15 ఏళ్ల ఓ మైనర్‌ బాలికతో సెక్స్‌ చేశాడనే ఆరోపణలతో ఈనెల 11న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

కెన్యా లైంగిక నేర నియంత్రణ చట్టాల ప్రకారం 18ఏళ్ల లోపు బాలికతో శృంగారం నిషిద్ధం. కాబట్టి నేరం రుజువయితే కిప్రుటో కెరీర్ ఇక ముగిసినట్లే. స్వయంగా పోలీస్ అధికారి అయిన కిప్రుటో అత్యాచారం కేసులో బెయిల్ ను పొందాడు. అయినప్పటికి ఈ కేసుతో అతను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానమే.