కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మృతిపై ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూనే కాఫీడే తనకు ఉన్న బంధాన్ని వివరించారు. తాను స్నేహితులతో కలిసి తొలిసారి కేఫ్ కాఫీడేలోనే కాఫీ తాగానని అశ్విన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సిద్ధార్థ్ మృతి చాలా భాధాకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు అశ్విన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు,పారిశ్రామికవేత్తలు కూడా సిద్ధార్థ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 ఇదిలా ఉండగా... సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్థ.. నేత్రావతి నదిలో బుధవారం శవమై కనిపించిన సంగతి తెలిసిందే. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని.. తన బోర్డు సభ్యులకు లేఖ రాసి మరీ ఆయన ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా సిద్ధార్థ్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ కు స్వయానా అల్లుడు కావడం గమనార్హం. బుధవారం శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.