Asianet News TeluguAsianet News Telugu

సింగపూర్ ఓపెన్ 2022 విజేతగా పీవీ సింధు... ఫైనల్‌లో సంచలన విజయం...

Singapore Open 2022: వుమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో చైనా ప్లేయర్‌ను చిత్తు చేసిన పీవీ సింధు... 2022లో మూడో టైటిల్ కైవసం...

PV Sindhu wins Singapore Open 2022 after beating Wang Zhi Yi
Author
India, First Published Jul 17, 2022, 12:01 PM IST

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పతకాన్ని జత చేసుకుంది. సింగపూర్ ఓపెన్ 2022 విజేతగా నిలిచి, 12 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారత బ్యాడ్మింటన్ వుమెన్స్ ప్లేయర్‌గా నిలిచింది. ఇంతకుముందు 2010లో భారత సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, సింగపూర్ ఓపెన్ గెలవగా ఆ రికార్డును సమం చేసింది పీవీ సింధు...

సైనా నెహ్వాల్ తర్వాత 2017లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్, మెన్స్ సింగిల్స్‌లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. ఓవరాల్‌గా సింగపూర్ ఓపెన్ గెలిచిన మూడో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు..

చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ వాంగ్ జీ యీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-9, 11-21, 21-15 తేడాతో విజయం అందుకున్న పీవీ సింధు, ఈ ఏడాది మూడో టైటిల్‌ని కైవసం చేసుకుంది. తొలి సెట్‌లో వాంగ్ జీ యీపై పూర్తి డామినేషన్ చూపించిన పీవీ సింధు, రెండో రౌండ్‌లో చైనా ప్లేయర్ జోరుకి కాస్త వెనకడుగు వేసింది. అయితే మూడో సెట్‌లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగిన పీవీ సింధు... మొట్టమొదటిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది...

ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ ఆలీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ 2022 టైటిల్స్ గెలిచిన పీవీ సింధుకి ఇది మూడో టైటిల్. అయితే ఇంతకుముందు గెలిచిన రెండు టైటిల్స్ కూడా బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300కి చెందినవి కాగా సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టైటిల్....

అంతకుముందు జపాన్‌ బ్యాడ్మింటన్ ప్లేయర్, వరల్డ్ నెం. 43 ర్యాంకర్ సైనా కవాకామితో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 21-15, 21-7 తేడాతో సునాయాస విజయం అందుకుని ఫైనల్‌లోకి ప్రవేశించింది పీవీ సింధు... భారత బ్యాడ్మింటన్ స్టార్ జోరు ముందు నిలవలేకపోయిన కవాకామి, కేవలం 31 నిమిషాల్లోనే చేతులు ఎత్తేసింది. చైనా ప్లేయర్ హాన్ యూతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 17-21, 21-11, 21-19 తేడాతో పోరాటం గెలిచింది పీవీ సింధు.  

ఈ సారి సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగు పెట్టిన సైనా నెహ్వాల్, సెమీస్ చేరలేకపోయింది. జపాన్ ప్లేయర్ల ఆయా ఓహోరితో జరిగిన మ్యాచ్‌లో 13-21, 21-15, 20-22 తేడాతో పోరాడి ఓడిన సైనా నెహ్వాల్, క్వార్టర్ ఫైనల్ నుంచి నిష్కమించింది...

అలాగే భారత పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్, జపాన్‌కి చెందిన కొడై నరోకాతో జరిగిన మ్యాచ్‌లో 21-12, 14-21, 18-21 తేడాతో పోరాడి ఓడాడు. అలాగే రెండో రౌండ్‌కి వెళ్లిన భారత డబుల్స్ పురుషుల జోడి అర్జున్, ధృవ్ కపిల్... ఇండోనేషియా డబుల్స్ జోడితో జరిగిన మ్యాచ్‌లో 21-10, 18-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యారు...

మొదటి సెట్‌లో ఇండోనేషియా జోడిపై తిరుగులేని ఆధిపత్యం చూపించిన భారత బ్యాడ్మింటన్ జోడి, రెండు, మూడో సెట్లలో పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది...

Follow Us:
Download App:
  • android
  • ios