కరోనా బ్రేక్ తర్వాత ఎట్టకేలకు స్థాయికి తగిన ప్రదర్శన కనబర్చింది తెలుగు తేజం పీవీ సింధు... సింధుపై తిరుగులేని రికార్డు ఉన్న స్పెయిన్ స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్‌, మరోసారి భారత స్టార్ షెట్లర్‌ను ఫైనల్‌లో ఓడించి, టైటిల్ కైవసం చేసుకుంది.

ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో టాప్ సీడ్ మారిన్ చేతుల్లో, రెండో సీడ్ పీవీ సింధు 12-21, 5-21 తేడాతో ఓడింది..కేవలం 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ ఫైనల్ ఫైట్‌లో మారిన్ జోరు ముందు, పీవీ సింధు ఏ మాత్రం నిలవలేకపోయింది.

ఒకానొక దశలో 6-4 తేడాతో ఆధిక్యం సాధించిన పీవీ సింధు, దాన్ని కొనసాగించలేకపోయింది. వరుస సెట్లు గెలిచి, మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన మారిన్, టైటిల్ విన్నర్‌గా నిలిచింది.

2021లో మారిన్‌కి ఇది మూడో టైటిల్ కాగా, 18 నెలల తర్వాత ఓ మెగా టోర్నీ ఫైనల్‌కి అర్హత సాధించింది పీవీ సింధు. ఇప్పటిదాకా సింధు, మారిన్ మధ్య 14 మ్యాచులు జరగగా స్పెయిన్ స్టార్‌కి 9 విజయాలు దక్కాయి.