Boxer Died: డ్రగ్స్ తీసుకుని యువ బాక్సర్ మృతి.. పంజాబ్‌లో విషాదం
Boxer Died: ఉజ్వల భవిష్యత్ ను ఫణంగా పెట్టి డ్రగ్స్ ను అతిగా వాడి ఓ యువ బాక్సర్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.
మత్తు పదార్థాలు ప్రాణాలు తీస్తున్నా పలువురు ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నారు. ఒక్కసారి అలవాటైందంటే జీవితాంతం వెంటాడి వేధించే డ్రగ్స్ మహమ్మారికి మరో క్రీడాకారుడు బలయ్యాడు. పంజాబ్ కు చెందిన కుల్దీప్ సింగ్ అనే 22 ఏండ్ల బాక్సర్ డ్రగ్స్ ను అధిక మోతాదులో సేవించడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. పంజాబ్ లోని బతింద జిల్లా తల్వండి సబూ గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ కు చిన్ననాటి నుంచే బాక్సర్ కావాలనేది కల. ఆ మేరకు అతడు సాధన చేశాడు. పతకాలు, పేరూ సాధించాడు. జూనియర్ స్థాయిలో స్వర్ణం సాధించిన కుల్దీప్ సింగ్.. ఆ తర్వాత సీనియర్ గానూ రాణించాలని దృష్టి సారించాడు. ఈ క్రమంలో అతడు ఇప్పటికే రాష్ట్రస్థాయి పోటీలలో ఐదు పతకాలు కూడా సాధించాడు.
అయితే బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుల్దీప్.. మళ్లీ ఇంటికి తిరిగిరాకపోయేసరికి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అతడు ఊరు శివారులో ఉన్న పొలాల్లో విగతజీవిగా పడిఉండటం చూసిన పలువురు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వాళ్లు అక్కడికి హుటాహుటిన పరుగెత్తుకెళ్లారు.
కుల్దీప్ సింగ్ మృతదేహం పక్కన హెరాయిన్ తో పాటు మరికొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అయితే అతడు డ్రగ్స్ ను అధిక మోతాదులో సేవించడం వల్లే మరణించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ అతడి కుటుంబసభ్యులు, కోచ్ మాత్రం.. కుల్దీప్ సింగ్ డ్రగ్స్ కు బానిస కాదని వాపోతున్నారు. ఏదేమైనా ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.