ప్రో  కబడ్డి లీగ్ సీజన్ 7 లో జైపూర్ పింక్ పాంథర్స్ మరోసారి ఓటమిపాలయ్యింది. పూణేలోని శ్రీ  శివ్ చత్రపతి స్టేడియం వేదికన జరిగిన మ్యాచ్ లో జైపూర్ కేవలం 6 పాయింట్ల తేడాతో యూపీ  యోదాస్ చేతిలో ఓడిపోయింది. దీపక్ నివాస్ హుడా 13 పాయింట్లతో రాణించి చివరివరకు పింక్ పాంథర్స్ ను గెలిపించుకోడానికి ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నాన్ని సమర్థవంతంగా అడ్డుకున్న యోదాస్ టీం స్వల్ప పాయింట్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. 

యూపీ విజయంలో శ్రీకాంత్ జాదవ్ 9, రిషాంక్ 8, సురేందర్ 7 పాయింట్లతో ప్రముఖ  పాత్ర పోషించారు. అలాగ నితేశ్ 3, సుమిత్ 2, అమిత్ 2 పాయింట్లతో తమవంతు సహకారం అందించారు. దీంతో యోదాస్ టీం రైడింగ్ లో 24,  ట్యాకిల్స్ లో  8, ఆలౌట్ల  ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 3 మొత్తం 38 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 

జైపూర్ జట్టు రైడింగ్  లో 21, ట్యాకిల్స్ లో 11 పాయింట్లతో యూపీకి గట్టిపోటీ ఇచ్చింది. కానీ ఎక్స్‌ట్రాల రూపంలో 1, ఆలౌట్ల ద్వారా పాయింట్లేమీ సాధించకపోవడంతో యూపీకంటే వెనుకబడిపోయింది. పాంథర్స్ ఆటగాళ్లలో దీపక్ హుడా 13 పాయింట్లతో అదరగొట్టి జట్టును గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అలాగే సుశీల్ 5, విశాల్ 3, సుదీప్ 3  పాయింట్లతో అతడికి సహకరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు 33-38 పాయింట్ల  తేడాతో యూపీ యోదాస్ విజేతగా నిలిచింది.