హోం గ్రౌండ్ లో సొంత ప్రేక్షకుల మధ్య సాగిన ఉత్కంఠ పోరులో యూ ముంబా జట్టుకు ఓటమి తప్పలేదు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో యూపి యోదాస్ తో తలపడ్డ ముంబై 4 పాయింట్ల తేడాతో పరాజయంపాలయ్యింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్న సమయంలో ముంబై చేసిన కొన్ని తప్పులు యూపీకి కలిసొచ్చాయి. దీంతో 23-27 పాయింట్ల తేడాతో ముంబైపై యూపి విజయాన్ని అందుకుంది. 

ఇరు జట్లు కూడా రైడింగ్ లో సమానంగా  పదేసి పాయింట్లు సాధించాయి. అయితే ట్యాకిల్స్ విషయంలో యూపీ 13, ముంబై 11 పాయింట్లు సాధించాయి. ఇక  ముంబైని  ఒకసారి ఆలౌట్ చేయడం ద్వారా యూపీకి మరో రెండు పాయింట్లు ఎక్కువగా లభించాయి. ఎక్స్‌ట్రాల రూపంలో కూడా ఇరు జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి. ఇలా ట్యాకిల్స్, ఆలౌట్ ల ద్వారా వచ్చిన నాలుగు పాయింట్లే యూపీ యోదాస్ కు విజయాన్ని సాధించిపెట్టాయి. 

ఆటగాళ్ల విషయానికి వస్తే యూపి యోదాస్ తరపున మోను గోయట్ 6, సుమిత్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నారు. మిగతావారిలో ఆశు సింగ్ 4, రిశంక్ 2, శ్రీకాంత్ 2, నిటేశ్ 2, అమిత్ 1 పాయింట్ సాధించారు. ముంబై  ఆటగాళ్లలో రోహిత్ ఒక్కడే 6 పాయింట్లు సాధించగలిగాడు. సురీందర్ సింగ్ 3, యొంగ్ చాంగ్ 3, అభిషేక్ 3, సందీప్ 3, ఫజల్ 2, అతుల్ 1 పాయింట్ సాధించారు. అయితే చివరి నిమిషంలో యూపీ యోదాస్ కాస్త జాగ్రత్తగా ఆడటంతో యూ ముంబాపై 23-27 తేడాతో గెలిచింది.