హోమ్ టౌన్  లో సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన ప్రో కబడ్డి మ్యాచ్ లో యూ ముంబా ఆటగాళ్లు చెలరేగిపోయారు. ముంబైలోకి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ పుణేరీ పల్టాన్ ను 10 పాయింట్స్ తేడాతో ముంబై టీం ఓడించింది. ముంబా ఆటగాళ్లు సమీష్టిగా పోరాడటం వల్లే ఈ విజయం సాధ్యమయ్యింది.  

హైదరాబాద్ లో ప్రారంభమైన ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 వారం రోజుల పాటు సక్సెస్ ఫుల్ సాగింది. రెండో వారం మొత్తం ముంబై లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ ఇండోర్  స్టేడియంలో జరగనుంది. ఇలా ముంబైకి చేరిన ప్రో కబడ్డీ  లీగ్ ను టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంఛనంగా ప్రారంభించారు. మ్యాచ్ ముగిసే వరకు కోహ్లీ అక్కడే వుండి సందడి చేయడం ఈ మ్యాచ్ కు హైలైట్ గా నిలిచింది. 

ఇక మ్యాచ్  విషయానికి వస్తే ముంబై ఆటగాళ్లలో రైడర్స్, డిపెండర్స్ సమిష్టిగా  రాణించారు. రైడర్లు15 పాయింట్స్ సాధించిపెడితే డిఫెండర్స్ 12 పాయింట్లు అందించారు. ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 4, అదనంగా 2 పాయింట్లు అభించడంతో ముంబై 33 పాయింట్ల వద్ద నిలిచింది. 

ఆటగాళ్ల విషయానికి వస్తే అభిషేక్ సింగ్ 5, అర్జున్ 5 టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతావారిలో రోహిత్ 4, సురీందర్4, సందీన్ నర్వాల్ 4, ఫాజల్ 4 పాయింట్లతో ఆకట్టుకున్నారు.  లి డాంగ్ ఒక్కడే ఒక్క పాయింట్ సాధించాడు. 

పుణేరి  పల్టాన్ జట్టులో సురీందర్ 6, పవన్ 4, సంకేత్ 3, మంజిత్ 3, శుభమ్ 3, సుశాంత్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అయినప్పటికి పుణేను విజయతీరాలకు చేర్చలేకపోయారు. మొత్తానికి 33-23  పాయింట్స్ తేడాతో రెండో  ఓటమిని చవిచూసింది.