ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో  తెలుగు టైటాన్స్ మొదటిసారి ఓ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని సాగించి విజయాన్ని అందుకుంది. హోం గ్రౌండ్ లోనే జైపూర్ పింక్ పాంథర్స్ ని చిత్తుచేసి  టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ ఆకాశమే  హద్దుగా చెలరేగి ఏకంగా 22 పాయింట్లు సాధించాడు. దీంతో టైటాన్స్ 20 పాయింట్ల తేడాతో స్థానిక జైపూర్ జట్టును ఓడించగలిగింది. 

హోంగ్రౌండ్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న జైపూర్ ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యింది. ఆ జట్టు విఫలమయ్యింది అనేకంటే టైటాన్స్ జట్టు అద్భుతంగా ఆడిందని చెప్పాలి. ముఖ్యంగా స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 22, రజనీశ్ 11 అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో రైడింగ్ లో 36, ట్యాకిల్స్ లో 12, ఆలౌట్ల ద్వారా 6  మొత్తంగా 51 పాయింట్లతో విజయకేతనం ఎగరేసింది. 

జైపూర్ జట్టు రైడింగ్ లో 22, ట్యాకిల్స్ లో  7, ఎక్స్‌ట్రాల ద్వారా 2 మొత్తం 31 పాయింట్లు మాత్రమే చేయగలిగింది. దీంతో 20 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఆటగాళ్లలో దీపక్ 12, నీలేశ్ 5, దీపక్ 4 పాయింట్లతో రాణించారు. అయినప్పటికి తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.