విరాట్ కోహ్లీ... టీమిండియా కెప్టెన్ మనందరికి సుపరిచితమే.అయితే అతడు కేవలం క్రికెట్ కు మాత్రమే పరిమితం కాలేదు. భారత్ లో ప్రతి క్రీడను ఆదరించడం, అవకాశం వస్తే ప్రమోట్ చేయడానికి ఎల్లపుడు ముందుంటాడు. అలా ఇటీవల హైదరాబాద్ వేదికన ప్రారంభమై ప్రో కబడ్డి లీగ్ కు ప్రచారం కల్పించేందుకు సిద్దమయ్యాడు. ఇందులోభాగంగా వెస్టిండిస్  పర్యటన కోసం తన బిజీ షెడ్యూల్ ను కలిగివున్న అతడు రేపు(శనివారం) ముంబైలో జరగనున్న ప్రో కబడ్డి మ్యాచ్ కు హాజరవనున్నాడు. 

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆరంభమైన ఈ ప్రో కబడ్డి సీజన్ 2 వారం పాటు ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది. అయితే శనివారం నుండి ఈ లీగ్ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని  సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఇక్కడ యూ ముంబా Vs పుణేరి పల్టాన్ మధ్య జరగనున్న మొదటి మ్యాచ్ కు కోహ్లీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఆటగాళ్లతో కలిసి అతడు జాతీయగీతాలాపన కార్యక్రమంలో పాల్గొని మ్యాచ్ ను లాంఛనంగా ప్రారంభించనున్నాడు. 

ఈ మేరకు  ప్రో కబడ్డి నిర్వహకులు కోహ్లీ రాకకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కోహ్లీ రాకతో సీజన్ 7 కు మరింత ప్రత్యేకంగా మారనుందని...బిజీ షెడ్యూల్ లో కూడా ఈ లీగ్ కోసం సమయం కేటాయించినందుకు కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. 

కోహ్లీ కేవలం క్రికెట్ ను మాత్రమే భారత క్రీడాకారులు రాణించే ప్రతి క్రీడను ఆదరిస్తుంటాడు. ఇటీవల కేవలం మూడు వారాల వ్యవధిలోనే 5 గోల్డ్ మెడల్స్ సాధించిన మహిళ స్పింటర్ హిమదాస్ ను అతడు ప్రత్యేకంగా అభినందించాడు. అలాగే గతంలో భారత పుట్ బాల్ జట్టును కూడా ఆదరించాలంటూ అభిమానులకు సూచించి గొప్ప మనసును చాటుకున్నాడు. అంతేకాకుండా పుట్ బాల్ లీగ్ లో సొంతగా ఓ జట్టును కూడా దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా 6 సీజన్లను పూర్తి చేసుకొని ఏడో సీజన్ ను ప్రారంభించిన  పో కబడ్డి లీగ్ మద్దతుగా  నిలిచేందుకు సిద్దమయ్యాడు.