ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో పుణేరీ పల్టాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్స్ టేబుల్ లో చిట్టచివరన నిలిచిన పూణే బలమైన బెంగళూరును ఓడించి సత్తా చాటింది. చెన్నైలోని జవహార్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పూణే ఆరంభంనుండి అదరగొట్టి స్ఫష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. పూణే ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడంతో 8 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ ని మట్టికరిపించగలిగింది.  

 పుణేరీ పల్టాన్ విజయంలో డిఫెండర్స్ కీలకపాత్ర పోషించారు. ట్యాకిల్స్ లో పూణే జట్టు 16 పాయింట్లు సాధిస్తే బెంగళూరు కేవలం 6 పాయింట్లతోనే సరిపెట్టుకుంది. మిగతా అన్ని విషయాల్లోనే ఫూణేకు గట్టిపోటీ ఇచ్చినా ట్యాకిల్ పాయింట్ల విషయంలో వెనుకబడ్డ బెంగళూరు ఓటమిని చవిచూసింది. మొత్తంగా పుణేరీ జట్టు రైడింగ్ లో 13, ట్యాకిల్స్ లో 16,  ఆలౌట్ల ద్వారా 2 పాయింట్లు సాధించగా బెంగళూరు  రైడింగ్ లో 16, ట్యాకిల్స్ లో 6, ఎక్స్‌ట్రాల  రూపంలో 1 పాయింట్ సాధించింది.  ఇలా 31-23  పాయింట్ల తేడాతో బెంగళూరుపై పూణే పైచేయి సాధించింది. 

పుణే ఆటగాళ్లలో  మంజిత్ 7, సుర్జీత్ 6, జాదవ్ 5, అమిత్ 5  పాయింట్లతో రాణించారు. మిగతావారిలో అమిత్ 2, నితిన్ 1, హదీ 1, సాగర్ 1, శుభమ్ 1  పాయింట్ సాధించారు. 

బెంగళూరు ఆటగాళ్లలో రోహిత్ 7, పవన్ 5, అమిత్ 4, బంటి 4 పాయింట్లతో సత్తాచాటారు. వీరు తప్పిస్తే మిగతా ఆటగాళ్ళెవరూ కనీస పాయింట్లు  కూడా సాధించకపోవడంతో బెంగళూరు బుల్స్ కు ఓటమి తప్పలేదు.