చెన్నై వేదికన జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో తమిళ్ తలైవాస్ మరో ఓటమిని చవిచూసింది. సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో తమిళ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడిపోయింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో విజయం పాంథర్స్ నే వరించింది. కేవలం 2 పాయింట్ల స్వల్ఫ తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. దీంతో చివరివరకు పోరాడినా తమిళ జట్టుకు ఫలితం దక్కలేదు. 

పింక్ పాంథర్స్ రైడింగ్ లో 14, ట్యాకిల్స్ లో 11 ఎక్స్‌ట్రాల రూపంలో 3  ఇలా మొత్తం  28 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో నీలేశ్ 7, విశాల్ 4, దీపక్ 3, దీపక్ నర్వాల్ 3  పాయింట్లతో రాణించారు. మిగతావారిలో సునీల్ 2, సందీప్ 2, పవన్ 2, నితిన్ 1,అమిత్ 1 పాయింట్ సాధించి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 

ఇక ఆతిథ్య తమిళ్ తలైవాస్ విషయానికి  వస్తే రాహుల్ చౌదరి 6, అజయ్ 6, వినీత్ 5 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అలాగే మోహిత్ 3, అజిత్ 2 పాయింట్లు సాధించారు. మిగతావారందరూ చేతులెత్తేయడంతో తమిళ జట్టుకు సొంత గడ్డపైనే ఓటమి తప్పలేదు. రైడింగ్ లో 16, ట్యాకిల్స్ లో 6, ఆలౌట్ ద్వారా 2, ఎక్స్‌ట్రాల  రూపంలో 2 ఇలా మొత్తం 26 పాయింట్లు సాధించింది. అయినప్పటికి పింక్ పాంథర్స్ కంటే 2 పాయింట్లు వెనుకబడి  26-28 తేడాతో ఓటమిని చవిచూసింది.