ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో బెంగళూరు బుల్స్ ప్లేఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టు జోరుకు జైపూర్ బ్రేకులు వేసింది. స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 16 పాయింట్లతో చెలరేగి పింక్ పాంథర్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇరుజట్లు చివరివరకు హోరాహోరీగా పోరాడినప్పటికి ఏడు పాయింట్లతో తేడాతో బెంగళూరు ఓటమిని చవిచూసింది. 

పంచకుల లోని తావు దేవీలాల్ స్పోర్ట్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభం నుండి ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడాయి. అయితే పాంథర్స్ ఆటగాడు ప్రదీప్ నర్వాల్ అద్భుత ప్రదర్శనతో 16 పాయింట్లు రాబట్టాడు.     అలాగ నీలేశ్ 9, విశాల్ 5, సందీప్ 4, అమిత్ 3 పాయింట్లు సాధించి జైపూర్ కు విజయాన్ని అందించారు. రైడింగ్ లో 30, ట్యాకిల్స్ లో 12, ఆలౌట్ల ద్వారా 2 మొత్తం 41 పాయింట్లతో ఆధిక్యాన్ని సాధించింది. 

బెంగళూరు ఆటగాళ్లలో పవన్ కుమార్ 14, సుమిత్ 7, అంకిత్ 3, బంటి 3 పాయింట్లతో రాణించినా విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. ఆ జట్టు రైడింగ్ లో 25, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 1 మొత్తం 34 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. దీంతో 7 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.