మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికన జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో మరోసారి జైపూర్ పింక్ పాంథర్స్ హవా కొనసాగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ జట్టును పింక్స్ పాంథర్స్ మట్టికరిపించింది. స్టార్  రైడర్ దీపక్ నివాస్ హుడా చెలరేగడంతో జైపూర్ టీం 16 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

జైపూర్ పింక్ పాంథర్స్ రైడింగ్ లో 17 పాయింట్లు సాధిస్తే అందులో 14 దీపక్ హుడా ఒక్కడే అందించాడు. దీన్ని బట్టే అతడి విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక   డిఫెండర్స్ లో సందీప్ అత్యధికంగా  6పాయింట్లు అందించాడు. మిగతా ఆటగాళ్ల విషయానికి  వస్తే విశాల్ 4, అమిత్ 2, సునీల్ 2, అజింక్య 2, దీపక్ నర్వాల్ 1 పాయింట్ తో జైపూర్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. 

మొత్తంగా జైపూర్ రైడింగ్ లో 17, ట్యాకిల్స్ లో 14, ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 4, ఎక్స్‌ట్రాల ద్వారా 2 పాయింట్లు సాధించింది. ఇలా మొత్తంగా 37 పాయింట్లతో పై పైచేయి సాధించింది. 

హర్యానా విషయానికి వస్తే రైడర్స్ 12 పాయింట్లతో పరవాలేదనిపించారు. ట్యాకిల్స్ లో మాత్రం 9 పాయింట్స్ సాధించి మొత్తం  21 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. ఆటగాళ్లలో సునీల్ 6, వినయ్ 6,సెల్వమణి 5 పాయింట్లతో ఆకట్టుకున్నారు. మిగతావారిలో నవీన్ 3, వికాస్ కాలె 1 పాయింట్ మాత్రమే చేయగలిగారు. దీతో హర్యానా 21-37 పాయింట్ల తేడాతో జైపూర్ చేతిలో ఓడిపోయింది. 

ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ లు తరలివచ్చారు. దీంతో ఈ మ్యాచ్ మరింత ఆకర్షణీయంగా మారింది.మ్యాచ్ జరుగుతున్నంత సేపు వారు జైపూర్ ఆటగాళ్లకు మద్దతునిచ్చారు. వీరి మద్దతు ఫలితమో ఏమో గానీ జైపూర్ పింక్స్ పాంథర్స్ జట్టే చివరకు విజేతగా  నిలిచింది.