ముంబై షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 పాట్నాకు చేరుకుంది. అయితే సొంత మైదానంలో...సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో పాట్నా పైరేట్స్  టీం  ఆకట్టుకోలేకపోయింది. పాటలి పుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జైపూర్ పింక్ పాంథర్స్ తో తలపడ్డ పైరేట్స్ జట్టు ఏకంగా 13 పాయింట్స్ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. 

జైపూర్, పాట్నా ఇరు జట్లు రైడింగ్ లో సమానంగా నిలిచినా ట్యాకిల్స్ విషయంలో హోం టీం పూర్తిగా  వెనుకబడిపోయింది. జైపూర్ డిపెండర్స్ ఏకంగా 17 పాయింట్లు సాధించగా పాట్నా కేవలం 7 పాయింట్లతో సరిపెట్టకుంది. అంతేకాకుండా రెండు సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా పింక్ పాంథర్స్ కు మరో 4  పాయింట్లు అదనంగా  లభించాయి. ఇలా   డిపెండర్స్ అద్భుత ప్రదర్శన వల్లే జైపూర్ టీ  భారీ పాయింట్ల తేడాతో పైరేట్స్ పై గెలవగలిగింది. 

జైపూర్ ఆటగాళ్లలో దీపక్ నర్వాల్ 9, సందీప్ 8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అలాగే అమిత్ హుడా 5, అజింక్య 3, విశాల్ 2, దీపక్  నివాస్ 1, సచిన్ నర్వాల్ 1 పాయింట్ తో జైపూర్ ను గెలిపించడంలో   తమ వంతు పాత్ర పోషించారు. 

పాట్నా టీంలో ప్రదీప్ నర్వాల్ 9, మోను 5 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.  అయితే వీరిద్దరు తప్ప మిగతా ఆటగాళ్లెవరూ రాణించకపోవడంతో పాట్నా కేవలం 21 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. దీంతో 21-34 పాయింట్ల తేడాతో జైపూర్ మరో విజయాన్ని  అందుకుని పాయింట్ల పట్టికలో దూసుకుపోయింది.