గచ్చిబౌలి స్టేడియం మరో ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. డిల్లీ దబాంగ్, తమిళ్ తలైవాస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో చివరకు డిల్లీదే  పైచేయిగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్  చివర్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని తమిళ ఆటగాళ్లు రెఫరీలతో వాగ్వాదానికి దిగే స్థాయికి చేరుకున్నాయి. అయినప్పటికి రెఫరీలు డిల్లీ దబాంగ్స్ నే విజేతలుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 1 పాయింట్ తేడాతో విజేతగా నిలిచి డిల్లీ పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 


ఈ మ్యాచ్ లో ఇరు జట్ల హోరాహోరీగా  పోరాడి అన్నిట్లోనూ సమానంగా నిలిచినా డిల్లీకి రెండు ఎక్స్ ట్రా పాయింట్స్ లభించాయి.  ఇదే తమిళ్ తలైవాస్ కొంపముంచింది. డిల్లీ జట్టు ఎక్స్‌ట్రాల రూపంలో 5 పాయింట్స్ లభించగా తమిళ జట్టుకు 3 పాయింట్స్ మాత్రమే లభించాయి.

ఇక డిల్లీ దబాంగ్ ప్రదర్శన విషయానికి వస్తే నవీన్ కుమార్ అత్యధికంగా 8 పాయింట్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే మేరాజ్ 6, జోగిందర్ సింగ్ 4, విశాల్ 2, చంద్రన్ 1, సయిద్ 1 పాయింట్స్ సాధించి డిల్లీ విజయానికి సహకారం అందించారు. ఇలా  రైడింగ్ 13, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్స్ ద్వారా 2 పాయింట్స్ లభించగా అదనంగా మరో 5  పాయింట్స్  లభించాయి. దీంతో డిల్లీ తలైవాస్ కంటే 1 పాయింట్ అదనంగా  పొంది విజేతగా నిలిచింది. 

ఇక తలైవాస్ విషయానికి  వస్తే స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతడు కేవలం 7 పాయింట్లు మాత్రమే సాధించాడు. మంజిత్ చిల్లర్ 5, అజయ్ ఠాకుర్ 5 పాయింట్స్ తో పరవాలేదనిపించారు. మోహిత్ చిల్లర్  2, అజిత్ 2, రన్ సింగ్ 1, అజిత్ 1 పాయింట్ సాధించారు.  ఇలా రైడర్స్ 12, డిపెండర్స్ 12, ఆలౌట్ 2, ఎక్స్‌ట్రాల ద్వారా 3 పాయింట్స్ లభించాయి.

అయితే డిల్లీతో చివరివరకు హోరాహోరీగా పోరాడికి తమిళ జట్టు చివరికి 29-30 తేడాతో  ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.