ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నాఫైరేట్స్ కు మరో ఓటమి తప్పలేదు. ఆ జట్టు స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 19 పాయింట్లతో అదరగొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. దీంతో ఇప్పటికే పాయింట్స్ పట్టికలో చివరి వరుసలో నిలిచిన  ఫైరేట్స్ మరింత కిందకు దిగజారింది. ఈ క్రమంలోనే పాట్నాపై విజయం సాధించిన దబాంగ్ డిల్లీ పాయింట్స్ పట్టికలో  టాప్ 2 కు చేరింది.  

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ వేదికన జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా ఇరు జట్ల స్టార్ రైడర్స్ అద్భుతంగా రాణించారు. విజేత దబాంగ్ డిల్లీ ఆటగాళ్ల విషయానికి వస్తే వినయ్ 13, నవీన్ 11,, చంద్రన్ 8, అనిల్ లు 4 పాయింట్లతో రాణించారు. వీరి విజృంభణతో రైడింగ్ లో ఏకంగా 32, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ ట్రాల ద్వారా మరో 2 మొత్తంగా డిల్లీ 43 పాయింట్లు సాధించింది. 

ఇక పాట్నా విషయానికి వస్తే ప్రదీప్ నర్వాల్ ఒక్కడే 19 పాయింట్లు సాధించగా లీ జంగ్ 7, వికాస్ 3 పాయింట్లతో సహకారం అందించారు. మిగతా ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. రైడింగ్ లలో 28, ట్యాకిల్స్  లో 6, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల ద్వారా 2 పాయింట్లు ఇలా మొత్తం 39 పాయింట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 4 పాయింట్ల తేడాతో పాట్నా మరో ఓటమిని చవిచూసింది.