సింధూ, పతకం గెలిస్తే, నీతో కలిసి ఐస్‌క్రీం తింటా... అథ్లెట్లతో వీడియో సమావేశంలో ప్రధాని మోదీ...
ప్రభుత్వం కూడా నేను కోరగానే వెంటనే సహకరించి, నా కోసం ఏర్పాట్లు చేసింది... - పీవీ సింధు
ఐస్‌క్రీమ్ కూడా తిననివ్వడం లేదు, కష్టమైన కంట్రోల్ చేసుకుంటున్నాని తెలిపిన తెలుగు తేజం పీవీ సింధు...
ఒలింపిక్స్ విశ్వక్రీడలకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. త్వరలో భారత ఒలింపిక్ అథ్లెట్స్ బృందం, టోక్యో బయలుదేరి వెళ్లనుంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒలింపిక్స్‌కి వెళ్లే అథ్లెట్లతో వీడియో సమావేశం ద్వారా ముచ్ఛటించారు. ఒలింపిక్స్ వెళ్లే అథ్లెట్స్ అందరితో ఒక్కరిక్కరిగా మాట్లాడి, ప్రిపరేషన్ గురించి తెలుసుకున్నారు.
హైదరాబాద్‌లో ఒలింపిక్స్ కోసం సిద్ధం అవుతున్న పీవీ సింధుతో కూడా మాట్లాడిన ప్రధాని మోదీ, ఆమె ప్రాక్టీస్ ఎలా జరుగుతుందని వాకబు చేశారు. ‘ఒలింపిక్స్‌లో స్టేడియాలు చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి నేను ప్రాక్టీస్ చేసేందుకు గచ్చిబౌలి స్టేడియాన్ని ఎంచుకున్నాను. ప్రభుత్వం కూడా నేను కోరగానే వెంటనే సహకరించి, నా కోసం ఏర్పాట్లు చేసింది...’ అని చెప్పింది పీవీ సింధు.
‘ఒలింపిక్స్ ప్రిపరేషన్స్ కోసం మీ అమ్మానాన్న, మీ ఫోన్ లాగేసుకున్నారంట, ఐస్‌క్రీమ్ కూడా తిననివ్వడం లేదంట...నిజమేనా’ అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. దానికి సింధు, ‘అది నిజమే సర్... క్రీడల్లో సక్సెస్ కావాలంటే, డైట్ ఫాలో అవ్వడం తప్పనిసరి, కాబట్టి కష్టమైనా నోటిని కంట్రోల్ చేసుకుంటున్నా...’ అంటూ చెప్పింది.
‘సింధు, నువ్వు ఈసారి కూడా ఒలింపిక్స్‌లో సక్సెస్ అవుతావని నాకు నమ్మకం ఉంది. అప్పుడు నిన్ను కలిసి, నీతో కలిసి ఐస్‌క్రీమ్ తింటాను...’ అంటూ తెలిపిన ప్రధాని మోదీ, సింధుని ప్రోత్సాహించి, ఆమెకు అన్ని విధాలా సహకరిస్తున్న తన తల్లిదండ్రులను అభినందించారు.