ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ని బహిష్కరించలేమని టీం ఇండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ అన్నారు. జమ్మూకశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడిలో 43 మంది భారత జవాన్లు  అమరులయ్యారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనంటూ.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేష్-ఏ-మహ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ఈ క్రమంలో ఈ ఏడాది మేలో జరిగే ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడొద్దని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కి హర్భజన్ సింగ్ సహా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు మద్దతునిచ్చారు. మరికొందరు ఏకంగా ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించేలా.. బీసీసీఐ, ఐసీసీపై ఒత్తిడి తీసుకురావాలని అంటున్నారు. కాగా..దీనిపై గవాస్కర్ స్పందించారు.

ప్రపంచకప్ నుంచి పాక్ ని బహిష్కరించలేమన్నారు. ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడాల్సిందేనన్నారు. భారత్ బహిష్కరిస్తే.. మనకే నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. పాక్ ని బహిష్కరించడానికి ఇతర దేశాలు అంగీకరించకపోవచ్చు అని ఆయన అన్నారు. పాకిస్తాన్ తో ఆడి.. ఆ జట్టుని ఓడించాలని గవాస్కర్ అన్నారు.