PKL 2021: మరో రెండ్రోజుల్లో ప్రో కబడ్డీ లీగ్.. తొలి మ్యాచ్ కు సిద్ధమైన బెంగళూరు బుల్స్
Vivo Pro Kabaddi League 8: రెండేండ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతున్న ప్రో కబడ్డీ లీగ్.. మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. మరో రెండ్రోజుల్లో వివో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 కు తెర లేవనుంది.
దేశవ్యాప్తంగా ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ దక్కింకున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 22 నుంచి ఈ క్రేజీ సీజన్ మొదలుకానున్నది. తొలి మ్యాచ్ లో.. సీజన్ 6 ఛాంపియన్స్ బెంగళూరు బుల్స్.. యు ముంబా ను ఢీకొననున్నది. కరోనా కారణంగా వరుసగా రెండేండ్ల పాటు వాయిదా పడ్డ ఈ లీగ్.. ఈసారి కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ.. పూర్తి బయో బబుల్ వాతావారణంలో జరుగబోతున్నది. బెంగళూరులోని షెరటాన్ గ్రాండ్ బెంగళూరు వైట్ ఫీల్డ్ హోటల్ లోనే అన్ని మ్యాచులు జరుగుతాయి. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచులను నిర్వహించనున్నారు.
డిసెంబర్ 22 న బెంగళూరు-యు ముంబా మ్యాచ్ కోసం వైట్ ఫీల్డ్ హోటల్ ముస్తాబైంది. కాగా.. సీజన్ 6 విన్నర్ అయిన బెంగళూరు బుల్స్.. ఈసారి కూడా టైటిల్ ఫేవరేట్స్ గా ఉంది. ఈ సీజన్ కూడా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న ఆ జట్టు.. అందుకు పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు.. 19 మందితో కూడిన తుదిజట్టును ప్రకటించింది.
గత సీజన్ తో పోల్చితే ఈసారి బెంగళూరు బుల్స్ మరింత పటిష్టంగా ఉంది. ఈసారి రిటెన్షన్ లో ఇరాన్ కు చెందిన మహలి, డాంగ్ జియెన్ లి (దక్షిణ కొరియా), జియార్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) లను నిలుపుకున్న ఆ జట్టుకు.. పవన్ కుమార్ సెహ్రావత్ సారథ్యం వహిస్తున్నాడు. మూడో సీజన్ నుంచి ఆ జట్టుతోనే ఉన్న పవన్ కుమార్ ఈసారి తన జట్టుకు టైటిల్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. వైస్ కెప్టెన్ మహేందర్ సింగ్ కూడా సారథికి సహకరించడానికి సిద్ధమయ్యాడు.
అర్జున అవార్డు గ్రహీత రణ్దీర్ శిక్షణలో కొద్దికాలంగా మెరుగైన ఫలితాలను సాధిస్తున్న బెంగళూరు బుల్స్.. ఈ సీజన్ లో ఎలాగైనా టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. రెండు దఫాలుగా జరుగనున్న ప్రో కబడ్డీ లీగ్ ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 22 నుంచి జనవరి మూడో వారం దాకా సాగనున్నది. ఈసారి ఒక్కోరోజు మూడు మ్యాచులు కూడా నిర్వహించనుండటం గమనార్హం.
కాగా.. ఈ సీజన్ కు ప్రేక్షకులను అనుమతించకపోవడంతో టీవీలో ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి గాను నిర్వాహకులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. బెంగళూరు బుల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. తమ జట్టుకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను విడుదల చేశాడు.
బెంగళూరు బుల్స్ జట్టు : పవన్ కుమార్ (కెప్టెన్), మహేంద్ర సింగ్ (వైస్ కెప్టెన్), మహలి, డాంగ్ జియాన్ లి,రెహ్మాన్, అమిత్, సౌరభ్ నందల్, మోహిత్ సెహ్రావత్, చంద్రన్ రంజిత్, మోరే జి బి, దీపక్ నర్వాల్, మయూర్ జగన్నాథ్, వికాస్, భరత్ హుడా, అమన్ అంటిల్, నసీబ్, రోహిత్ కుమార్, అంకిత్, రోహిత్ సంగ్వాన్
కోచ్ : రణ్ధీర్ సింగ్ సెహ్రావత్