PKL 2021: కూత మొదలవ్వబోతోంది..! దుమ్ము రేగాల్సిందే.. దమ్ము చూపాల్సిందే.. 8వ కబడ్డీ సీజన్ కు ముహుర్తం ఖరారు
Pro Kabaddi 8: కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. ఈ కూత వింటేనే ఒళ్లంతా పూనకం వస్తుంది. చిన్నప్పుడు స్కూల్ లో ఆడిన జ్ఞాపకాలు మదిలో మెదలాల్సిందే. మాయదారి రోగం కరోనా కారణంగా గతేడాది వాయిదాపడ్డ మనదైన క్రీడ ప్రో కబడ్డీ 8వ సీజన్ మళ్లీ మొదలుకానుంది.
భారత్ లో ఐపీఎల్ (ipl) తర్వాత అత్యధికంగా టీవీ ప్రేక్షకులను అలరించే గేమ్ కబడ్డీ. ఇండోర్ గేమ్ అయిన కబడ్డీకి పూర్వ వైభవం కల్పిస్తూ.. కొత్త ఆటగాళ్లను వెలికితీయడానికి ఉద్దేశించిన ప్రో కబడ్డీ సీజన్ మళ్లీ మొదలుకాబోతుంది. 8వ సీజన్ గా వస్తున్న ఈ హై ఓల్టేజీ ఈవెంట్ డిసెంబర్ 22న ప్రారంభం కానున్నది.
బెంగళూరు వేదికగా జరిగే కబడ్డీ మ్యాచ్ లకు కంఠీరవ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్ కు సంబంధించిన మ్యాచ్ లన్నీ ఇక్కడే నిర్వహించనున్నారు. ఇది బెంగళూరు బుల్స్ హోంగ్రౌండ్ కావడం వారికి కలిసొచ్చే అంశం. కంఠీరవతో పాటు జైపూర్, అహ్మదాబాద్ లను కూడా షార్ట్ లిస్ట్ చేసినా దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో పాటు మొత్తం షెడ్యూలుకు సంబంధించినదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలాఉండగా ప్రో కబడ్డీ లీగ్ 2021 కోసం ఆటగాళ్లందరికీ ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిందని లీగ్ నిర్వాహకులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా ఈ లీగ్ ను నిర్వహించలేదన్న విషయం తెలిసిందే. అయితే త్వరలో జరుగబోయే 8వ సీజన్ కూడా ఈ ఏడాది జులైలోనే జరుగాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా దానిని అది వాయిదా పడింది.
ఈ సీజన్ కోసం ఆగస్టులో ఆక్షన్ నిర్వహించగా .. యూపీ యోధాస్ టీమ్ ప్రదీప్ నర్వాల్ ను లీగ్ లో మునుపెన్నడూ లేనంతగా రూ. 1.65 కోట్లకు కొన్నది. డిసెంబర్ లో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో అంతకుముందే టీమ్ లు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాయి. ప్రీ సీజన్ క్యాంప్ పేరిట నిర్వహిస్తున్న ఈ క్యాంప్స్ లో ఆటగాళ్లు తమ ఆటకు మెరుగులు దిద్దుతున్నారు. మరి ఇంతవరకు టైటిల్ నెగ్గని తెలుగు టైటాన్స్ ఈసారైనా కప్ నెగ్గుతుందో లేదో వేచి చూడాలి.