పారాలింపిక్స్‌లో టీమిండియాకి షాక్... భారత అథ్లెట్ వినోద్ కుమార్ పతకం వెనక్కి...
డిస్కస్ త్రో ఈవెంట్‌లో పోటీపడి కాంస్యం గెలిచిన వినోద్ కుమార్... వినోద్‌కి పతకాన్ని ఇవ్వడం లేదని ప్రకటించిన టోక్యో పారాలింపిక్స్ కమిటీ...
పారాలింపిక్స్‌లో 24 గంటల వ్యవధిలో ఏడు పతకాలు సాధించిన టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. డిస్కస్ త్రో ఈవెంట్‌లో పోటీపడిన వినోద్ కుమార్ సాధించిన కాంస్య పతకాన్ని ఇవ్వడం లేదని ప్రకటించింది టోక్యో పారాలింపిక్స్ కమిటీ.
వినోద్ కుమార్ మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్52 విభాగంలో పోటీపడి మూడో స్థానంలో నిలిచాడు. అయితే అతని క్లాసిఫికేషన్ సరిగా లేదని చెప్పిన పారాలింపిక్స్ కమిటీ, వినోద్ కుమార్ విజయాన్ని చెల్లదని ప్రకటించింది...
పారాలింపిక్స్‌లో అథ్లెట్ల వైకల్యాన్ని బట్టి వారి బలం, పరిమిత కదలిక పరిధి, అవయవ లోపం, కాలి పొడవులో వ్యత్యాసం, అథ్లెట్లు కూర్చున్న స్థానం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే 19.91 మీటర్లు విసిరి ఆసియా రికార్డు క్రియేట్ చేసిన వినోద్ కుమార్ ఇచ్చిన క్లాసిఫికేషన్ సరిగా లేదని భావించిన పారాలింపిక్స్ కమిటీ, అతను పోటీలో నిలిచేందుకు అనర్హుడిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
వినోద్ కుమార్ పతకం వెనక్కి తీసుకోవడంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మళ్లీ ఆరుకి పడిపోయింది. ఇందులో ఓ స్వర్ణం, నాలుగు రజతాలు, ఓ కాంస్య పతకాలు ఉన్నాయి.