Asianet News TeluguAsianet News Telugu

నన్ను మానసికంగా వేధిస్తున్నారు... ఒలింపిక్ మెడిలిస్ట్, బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్ షాకింగ్ పోస్ట్...

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత వుమెన్స్ బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్... కామన్వెల్త్ గేమ్స్‌కి ముందు తనని వేధిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు...

Olympic medalist boxer Lovlina Borgohain shocking post on harassment before Commonwealth Games
Author
India, First Published Jul 25, 2022, 5:17 PM IST

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కాంస్య పతకం గెలిచి, భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన భారత బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్... కామన్వెల్త్ గేమ్స్ 2022 పోటీలకు ముందు సంచలన ఆరోపణలు చేసింది. తనను, తన కోచ్‌లను మానసికంగా వేధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చేసిన లోవ్లీనా పోస్టు, భారత క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది...

‘నేను పుట్టెడు దుఃఖంతో ఈ విషయాన్ని బయటపెడుతున్నాను. నేను అనేక వేధింపులను ఎదుర్కొంటున్నా. నేను ఒలింపిక్స్‌లో మెడల్ గెలవడానికి సహయపడిన కోచ్‌లను మాటిమాటికి మారుస్తూ నా ట్రైయినింగ్ ప్రాసెస్ సరిగ్గా జరగనివ్వడం లేదు...

ట్రైయినింగ్‌లోనే కాదు, కాంపీటీషన్స్‌లోనూ నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇందులో ఓ కోచ్ సంధ్యా గురున్‌జీ ద్రోణాచార్య అవార్డు కూడా గెలిచారు. కొన్ని వేల సార్లు చేతులు మొక్కి వేడుకుంటే చాలా ఆలస్యంగా ఇద్దరు కోచ్‌లను నా ట్రైయినింగ్ కోసం క్యాంప్‌కి పంపించారు...

కామన్వెల్త్ గేమ్స్‌కి ముందు ఇలా నన్ను ఇబ్బంది పెడుతూ, ఆందోళనకు గురి చేస్తున్నారు, వీళ్ల వల్ల నేను తీవ్రమైన మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నాను. నా కోచ్ సంధ్యా గురున్‌జీ‌కి కామన్వెల్త్ విలేజ్‌కి ఎంట్రీ దొరకలేదు. ఆయనకి లోపలికి రావడానికి ఇంకా ఎంట్రీ పాస్ కూడా దొరకలేదు...

నా ట్రైయినింగ్ ముగియడానికి ఇంకా 8 రోజుల సమయం మాత్రమే ఉంది. నా ఇంకో కోచ్‌ని కూడా ఇండియాని పంపించేశారు. నేను ఎన్నిసార్లు వేడుకున్నాక కూడా ఇలా జరుగుతోంది. నేను గేమ్‌పైన ఎలా ఫోకస్ పెట్టాలో అర్థం కావడం లేదు... 

వీళ్ల వల్ల వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయా. ఇప్పుడు ఈ రాజకీయాల కారణంగా కామన్వెల్త్ కూడా పాడుకావడం నాకు ఇష్టం లేదు. ఈ రాజకీయాలను అధిగమించి నా దేశానికి పతకం తేవాలని ఆశపడుతున్నా... జై హింద్’ అంటూ సంచలన పోస్టు చేసింది భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్... 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్ 69 కేజీల విభాగంలో సెమీ ఫైనల్ చేరి కాంస్య పతకాన్ని సాధించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios