భారత మహిళల బాక్సింగ్‌లో అత్యంత ఆసక్తికర ఫైట్‌కు రంగం సిద్ధమైంది. సమాన అవకాశాల కోసం గళమెత్తిన తెలంగాణ యువ బాక్సర్‌, మాజీ ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఎట్టకేలకు ఒలింపిక్‌ బెర్త్‌ కోసం ప్రపంచ ఛాంపియన్, దిగ్గజం మేరీకోమ్‌తో బాక్సింగ్ సమరానికి సై అంటోంది. 

ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ కోసం న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన మహిళల 51 కేజీల విభాగం ట్రయల్స్‌లో మేరీకోమ్‌, నిఖత్‌ జరీన్‌ లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. 

ఆరు సార్లు వరల్డ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌ తొలి రౌండ్‌లో రితుపై సునాయాస విజయం నమోదు చేసింది. మాజీ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ తొలి ఫైట్‌లో జ్యోతిపై మంచి విజయమే సాధించింది. ఫైనల్స్ చేరిన ఈ ఇద్దరు విజేతలు మేరీకోమ్‌, నిఖత్‌ జరీన్‌ నేడు తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. 

Also read: ఎంపి కవిత ను కలిసిన బాక్సర్ నిఖత్ జరీన్

మామూలుగా ఒలింపిక్స్ కోసం జరిగే క్వాలిఫయర్స్ అయితే వీటికింత ప్రాధాన్యత ఉండేది కాదు. కాకపోతే నిఖత్ జరీన్ పట్టుబట్టిమరీ ఈ ట్రయల్స్ నిర్వహించేలా రూల్స్ ని ఫాలో అయ్యేలా బాక్సింగ్ ఫెడరేషన్ ని ఒప్పించగలిగింది. 

ట్రయల్స్‌ లేకుండానే మేరీకోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటుందని బాక్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ప్రకటన చేయటంతో, నిఖత్‌ జరీన్‌ క్రీడా మంత్రికి బహిరంగ లేఖ రాసి సమాన అవకాశాలు కల్పించాలని గతంలో కోరింది. 

ప్రతిభావంతురాలైన యువ బాక్సర్‌ తన సమన హక్కులు దక్కించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో విజయం సాధించింది. బాక్సింగ్‌ దిగ్గజం ఫైట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా వేదికగా మహిళల బాక్సింగ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ జరుగనున్నా సంగతి తెలిసిందే.