ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మరో కొత్త వివాదం తలెత్తింది. ఇటీవల మన్కడింగ్ వివాదం హాట్ టాపిక్ గా మారగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఇషాంత్ శర్మ, కగిసో రబాడ స్లెడ్జింగ్‌కు తెరలేపారు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్‌పై ఓవర్ల వ్యవధిలో ఇషాంత్, రబాడ వాగ్వాదానికి దిగారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం 148 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి దూకుడుగా ఆడిన షేన్ వాట్సన్ తన బ్యాటింగ్ తో మెరుపులు కురిపించాడు.

అయితే.. రబాడా విసిరిన ఓ షార్ట్ పిచ్ బంతిని షేన్ వాట్సన్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది బ్యాట్ కి కాకుండా వాట్సన్ కి నేరుగా వెళ్లి తగిలింది. దీంతో నొప్పితో కాసేపు వాట్సన్ విలవిలలాడాడు. అనంతరం ఆ బంతిని అందుకునేందుకు అక్కడికి వెళ్లిన రబాడా కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు.

ఆ తర్వాతి బాల్ కి సింగిల్ తీసిన వాట్సన్ తన నోటికి పని చెప్పాడు. దీంతో రబాడా కూడా ధీటుగా బదులివ్వడంతో ఫీల్డ్ అంపైర్, ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ కలగజేసుకున్నాడు. అంతకముందు అంబటి రాయుడు వికెట్ తీసిన సయంలో ఇషాంత్ శర్మ కూడా వాట్సన్ పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.