World Athletics 2022: ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఫైనల్ కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా.. గెలిస్తే చరిత్రే
World Athletics Championships 2022: జావెలిన్ త్రోలో గత కొంతకాలంగా అద్భుతాలు చేస్తున్న ఇండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో ఫైనల్ కు దూసుకెళ్లాడు.
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. అమెరికాలో యూజీన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2022 లో అతడు ఫైనల్ చేరాడు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రూప్-ఏ జావెలిన్ త్రో అర్హత రౌండ్ లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించాడు. నీరజ్ తో పాటు మరో భారత ఆటగాడు రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యాడు. మహిళల ఈవెంట్ లో గురువారం జరిగిన అర్హత రౌండ్లలో భారత క్రీడాకారిణి అన్నూ రాణి కూడా ఫైనల్ చేరింది.
ఫైనల్ కు అర్హత రౌండ్లలో భాగంగా గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 89.91 మీటర్ల దూరం విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానం నీరజ్ చోప్రా (88.39) దే. ఈ జాబితాలో రోహిత్ యాదవ్.. 11వ స్థానం (80.42) మూడో స్థానంలో నిలిచాడు.
ఆ ఇద్దరి నుంచే తీవ్ర పోటీ..
నీరజ్ చోప్రాకు ఈ ఈవెంట్ లో అండర్సన్ తో పాటు ఒలివర్ (ఫిన్లాండ్) నుంచి తీవ్ర పోటీ ఎదురువుతున్నది. ఈ సీజన్ లో అండర్సన్ ఏకంగా మూడుసార్లు 90 మీటర్ల మార్కును చేరుకున్నాడు. ఇక ఒలీవర్.. ఈ సీజన్ లో రెండు సార్లు 89 మీటర్ల దూరాన్ని దాటాడు. వీళ్లిద్దరితో్ పాటు చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకుబ్ వాద్లెచ్ కూడా ఈ సీజన్ లో 90 మీటర్ల దూరాన్ని క్రాస్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో భాగంగా క్వాలిఫై రౌండ్ లో అతడు 85 మీటర్లే విసిరినా ఫైనల్ లో సత్తా చూపే అవకాశం లేకపోలేదు.
పతకం గెలిస్తే రెండో అథ్లెట్..
ఇక ఫైనల్లో గనక నీరజ్ చోప్రా పతకం సాధిస్తే అది చరిత్రే కానుంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో ఇంతవరకు భారత్ తరఫున అంజూ జార్జి మాత్రమే ఈ పోటీలలో పతకం సాధించింది. 2003 లో పారిస్ లో ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ లో అంజూ జార్జి.. లాంగ్ జంప్ లో కాంస్య పతకం అందుకుంది. ఇప్పుడు నీరజ్ చోప్రా పతకం గెలిస్తే అతడు ఈ పోటీలలో మెడల్ గెలిచే రెండో భారతీయుడవుతాడు. ఇక నీరజ్ ఫైనల్ మ్యాచ్ శనివారం (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరుగనుంది.
ఫైనల్లోకి ఎల్డోజ్ పౌల్..
జావెలిన్ త్రోతో పాటు ట్రిపుల్ జంప్ లో కూడా భారత్ కు మంచి ఫలితాలే వచ్చాయి. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైనల్లోకి భారత అథ్లెట్ ఎల్డోజ్ పౌల్ అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ రౌండ్ లో అతడు తొలి ప్రయత్నంలోనే 16.68 మీటర్ల దూరం దూకాడు. ఆ తర్వాత దానిని 16.68కి మెరుగుపరుచుకున్నాడు.