Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్వూల్లో నీరజ్ చోప్రాకు సెక్స్ లైఫ్, గర్ల్ ఫ్రెండ్, ఆలింగనాలపై ప్రశ్నలు.. మండిపడుతున్న నెటిజన్లు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏకైక స్వర్ణ పతాకాన్ని అందించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా మనదేశంలో కొందరు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూలో కొన్ని అభ్యంతరకర, అనవసర ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో ‘మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా?’, ‘మీకు నాకు హగ్ ఇస్తారా?’ వంటి ప్రశ్నలతోపాటు తాజా ప్రశ్న ఈ చెత్తను పరాకాష్టకు తీసుకెళ్లింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆయన సెక్స్ లైఫ్ ప్రశ్నలు వేయడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

neeraj chopra faced some offensive, objectionabel questions after winning his gold in tokyo olympics
Author
New Delhi, First Published Sep 6, 2021, 12:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏకైక స్వర్ణాన్ని భారత్‌కు అందించి పౌరులందరి మనసు గెలుచుకున్నారు. ఈ చరిత్రాత్మక విజయం తర్వాత ఆయన ఇంటర్వ్యూ కోసం మీడియా సంస్థలు బారులుతీరాయి. కొన్ని హుందాగా సాగినా, కొన్ని చవకబారు ప్రశ్నలతో ఆయనను ఇబ్బందిపెట్టాయి. ఆసక్తి, వ్యక్తిగతానికి మధ్య గీతను చెరిపేస్తూ అనవసరమైన, అర్థంలేని ప్రశ్నలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇప్పటికే ఆయనను గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగారు. ఆన్‌లైన్‌లోనే తనకు హగ్ ఇస్తారా? అని నిస్సిగ్గుగా అభ్యర్థించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఇంటర్వ్యూయర్‌పై దుమ్మెత్తి పోశారు.

ఇటీవలే చరిత్రకారుడు రాజీవ్ సేథి ప్రశ్నలపై నెటిజన్లు మండిపడ్డారు. ఆయన ఇంటర్వ్యూ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా సెక్స్ లైఫ్‌పై ప్రశ్నలు వేశారు. ‘నీరజ్ నీవింత సుందరమైన యువకుడివి కదా’ అంటూ తన అభ్యంతరక ప్రశ్నను ఆయన ముందుంచారు. నాకు తెలుసు ఇది అర్థం లేని ప్రశ్నే అని, కానీ, దీని వెనుకా కొన్ని బలమైన ప్రశ్నలున్నాయని సేథీ అన్నారు. తర్వాత ‘మీరు మీ ట్రెయినింగ్‌ను సెక్స్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారు?’ అని అడిగేశారు. ఈ ప్రశ్నకు నీరజ్ చోప్రా ఒకింత అసహనానికి గురయ్యారు. సమాధానమివ్వడానికి నిరాకరించారు. ‘సారీ సార్’ అని ప్రశ్నను దాటేస్తున్నట్టు స్పష్టం చేశారు.

 

కానీ, అదే ప్రశ్నను సేథీ ఇంకోసారి అడిగారు. నీరజ్ చోప్రా మళ్లీ తిరస్కారమే సమాధానంగా చెప్పారు. ప్లీజ్ సార్ అని పేర్కొంటూ ఆయన ప్రశ్నలతో తన మనసు నిండిపోయిందని అన్నారు. దీంతో ఇంటర్వ్యూయర్ కూడా కలుగజేసుకుని ఈ ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వాల్సిన పనిలేదని తోసిపుచ్చారు. అనంతరం ఈ ప్రశ్న అడిగినందుకు క్షమించాలని సేథీ అన్నారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో ఇప్పటికే కనీసం నాలుగు లక్షల మంది చూశారు. వీటిపై పలువురు ప్రముఖులు స్పందించారు.

 

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, నీరజ్ చోప్రా ఆ ప్రశ్నలకు స్పందించిన తీరును ప్రశంసించారు. అర్థంపర్థం లేని ప్రశ్నలకూ ఆయన హుందాగా సమాధానమిచ్చారని కితాబిచ్చారు. నీరజ్ చోప్రా జాతీయ స్థాయి ఐకాన్ అని మీడియా గుర్తించాలని, ఆయన వయసు, బ్యాక్‌గ్రౌండ్‌కు అతీతంగా ఆయనను గౌరవించాలని ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ సూచించారు. తరుచూ ఆయనను అగౌరవపరచవద్దని, ఇది కచ్చితంగా క్లాస్ బయాస్ అని మండిపడ్డారు. ఐఏఎస్ హిమాన్షఉ కౌశికక్, మరో ఐఏఎస్ ప్రియాంక శుక్లా కూడా ఇదే తరహాలో స్పందించారు.

ఓ నెటిజన్ నీరజ్ చోప్రాను ఇబ్బందిపెట్టిన ప్రశ్నల జాబితాను ప్రస్తావించారు. 1. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా? 2. మీరు వర్చువల్‌గా నాకు హగ్ ఇస్తారా? 3. మీరు మీ సెక్స్ లైఫ్‌కు ట్రెయినింగ్‌కు మధ్య ఎలా బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తారు? వంటి చెత్త ప్రశ్నలు నీరజో చోప్రాకు వేసినట్టు ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios