భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఇవాళ(ఆగస్ట్ 29) యావత్ దేశం క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశ కీర్తిని మరింత పెంచెలా అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టే క్రీడాకారులను ఈ రోజున గౌరవించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అలాంటిది తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మన తెలుగు క్రీడాకారులను అవమానించే సంఘటన బయటపడింది.  

క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపి ప్రభుత్వం విశాఖ పట్నంలో భారీ హోర్డింగ్ ను ఏర్పాటుచేసింది. సాగర తీరంలో ప్రజలందరికి కనిపించేవిధంగా ఓ మెయిన్ సెంటర్ లో లో దీన్ని ఏర్పాటుచేశారు.  హైదరబాదీ  టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పోటోను మధ్యలో మెయిన్ గా కనిపించేలా,హోర్డింగ్ కు ఇరువైపులా ముఖ్యమంత్రి జగన్, క్రీడా  మంత్రి అవంతి శ్రీనివాస్ ల ఫోటోలతో చాలా చక్కగా డిజైన్ చేశారు. సహజంగా అయితే జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఇలా క్రీడలకు ప్రచారం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యను ప్రజలు మెచ్చుకోవాలి. కానీ ఈ హోర్డింగ్ మాత్రం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. 

 క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ప్రభుత్వ హోర్డింగ్, దానిపై పోటోలు బాగానే వున్నాయి. కానీ దానిపై తప్పుల తడకగా వున్న రాతలే ప్రభుత్వాన్ని, క్రీడా శాఖను నవ్వులపాలయ్యే చేస్తున్నాయి. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఫోటో పెట్టి దానికింద పిటి ఉష అని పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు అనే పదాన్ని ఇంగ్లీష్ లో రాసే క్రమంలో తప్పులు దొర్లాయి. దీంతో ఈ హోర్డింగ్ ను చూసినవారు  క్రీడలను, క్రీడాకారుల అవమానించేలా వున్న ఈ దీన్ని వెంటనే  తొలగించాలని కోరారు. 

మరికొందరయితే  ఈ హోర్డింగ్ ను పోటో తీసి సోషల్  మీడియా లో పెట్టారు. క్రీడల పట్ల ప్రభుత్వానికి  ఎంత చిత్తశుద్ది వుందో చెప్పడానికి ఈ పోస్టరే నిదర్శనమంటూ  కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలా  తప్పుల తడకగా వున్న ఈ పోస్టర్ ను  చూసి కొందరు నవ్వుకోగా, మరికొందరు ప్రభుత్వం, క్రీడాశాఖ నిర్లక్ష్యంపై సీరియస్ అవుతున్నారు. ఇలా క్రీడా దినోత్సవం రోజునే క్రీడాకారులను అవమానించే హోర్డింగ్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం క్రీడాశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే వారు ఈ హోర్డింగ్ ను తొలగించారు.