దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టైటిల్ విజేతగా మరోసారి ముంబై ఇండియన్స్ నిలించింది. వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచి ఓవరాల్ గా ఐదోసారి టైటిల్ ను ఎగరేసుకుపోయింది రోహిత్ సేన. ఫైనల్లో డిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుచేసి ఐదోసారి ఐపిఎల్ విజేతగా నిలిచింది ముంబై జట్టు. 

మంగళవారం జరిగిన ఫైనల్లో విజయం అనంతరం రోహిత్ మాట్లాడుతూ... తన కోసం వికెట్ ను త్యాగం చేసిన సూర్యకుమార్ యాదవ్ ను ఆకాశానికెత్తాడు. ఈ సీజన్లో అతడు అద్భుతంగా ఆడి టైటిల్ విజేతగా ముంబై నిలవవడంలో కీలక పాత్ర పోషించాడని అన్నాడు. 

''అతడు పరిపక్వత కలిగిన ఆటగాడు. అందువల్లే  కీలక సమయంలో జట్టు విజయంకోసం తన వికెట్ ను త్యాగం చేశాడు. నిజం చెప్పాలంటే అతడి కోసం తన వికెట్ ను కూడా త్యాగం చేయడానికి సిద్దమే. అతడి ఫామ్, ఈ సీజన్లో సాధించిన పరుగులు అలా వున్నాయి'' అంటూ సూర్యకుమార్ యాదవ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు కెప్టెన్ రోహిత్. 

READ MORE  IPL 2020 MI VS DC Final: 5వ ఐపీఎల్ టైటిల్ తో చరిత్ర సృష్టించిన రోహిత్ సేన, ఢిల్లీ ఫస్ట్ ఫైనల్ ఆశలు ఆవిరి

గాయం తర్వాత ఆడిన మొదటి మ్యాచ్‌లో 4, రెండో మ్యాచ్‌లో డకౌట్ అయిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 157 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్‌ నుంచి ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. వరుస బౌండరీలు బాదుతూ ఢిల్లీ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం లేకుండా చేశారు ముంబై బ్యాట్స్‌మెన్. 

డి కాక్ 20 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులకి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి అవుట్ కాగా.. ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్లతో 33 పరుగులు చేసి లాంఛనాన్ని ముగించారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలవగా, ఢిల్లీ బౌలర్ రబాడా అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలిచాడు.