టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... బుధవారం సైనిక విధుల్లో చేరారు. రెండు నెలలు ఆటకు విరామం పలికి ధోనీ... నేడు ఆర్మీలో చేరారు. వచ్చే నెలలో టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు జట్టు ఎంపిక చేసే సమయంలో ధోనీని సెలక్ట్ చేస్తారా లేదా అన్న సందేహం అందరిలో కలిగింది. కాగా... అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... తాను ఆర్మీలో చేరుతున్నానని ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ధోనీ బుధవారం విధుల్లో చేరారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆగస్ట్‌ 15 వరకు కశ్మీర్‌ లోయలో సేవలందించనున్నాడు. కశ్మీర్‌ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ గార్డ్‌ డ్యూటీలను ధోని నిర్వర్తించనున్నారు. 

కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్‌ ఫోర్స్‌లో ధోని పనిచేయనున్నాడని, సైన్యంతో పాటే ఉంటాడని భారత ఆర్మీ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొంది. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. 

పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు.