పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతుండటాన్ని నిరసిస్తూ.. సోమవారం కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా..ఈ బంద్ లో టీం ఇండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ కూడా పాల్గొన్నాడంటూ.. ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో అభిమానులంతా ధోనీ భారత్‌ బంద్‌లో పాల్గొనడం నిజమేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఫోటోలో ధోని, ఆయన భార్య సాక్షి మరికొందరు ఓ పెట్రోల్ బంక్ లో కూర్చుని ఉన్నట్లుగా ఉంది. దీంతో భారత్ బంద్ లో భాగంగానే ధోని పెట్రోల్ బంక్ లో కూర్చున్నారంటూ నెట్టింట ప్రచారం మొదలైంది.అయితే, తాజాగా దీనిపై ధోనీ సన్నిహితులు వివరణ ఇచ్చారు. ‘ధోనీ భారత్‌ బంద్‌లో పాల్గొనలేదు. గత నెలలో యాడ్ షూటింగ్‌ నిమిత్తం ధోనీ సిమ్లాలో పర్యటించాడు. ఈ సమయంలో తీసిన ఫొటో ఇది. అంతేకానీ, ధోనీ ఎలాంటి నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు’ అని వారు తెలిపారు.

ప్రస్తుతం ధోనీ క్రికెట్‌ నుంచి కాస్త విరామం దక్కడంతో తన సమయాన్ని కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ధోనీ ఆడనున్నాడు. ఇందుకోసం కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మరికొందరు ఆటగాళ్లతో కలిసి ధోనీ గురువారం దుబాయ్‌ బయలుదేరనున్నట్లు సమాచారం.