Sonia Raman: ఎన్బీఏ లో కోచ్ గా సోనియా రామన్.. తొలి భారత సంతతి మహిళగా చరిత్ర
NBA: అమెరికాతో పాటు యావత్ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్న నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లో భారత సంతతికి చెందిన సోనియా రామన్ కోచ్ గా నియమితురాలైంది.
భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఎంత క్రేజ్ ఉందో అమెరికాలో నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) కు అంతకంటే రెట్టింపు క్రేజ్ ఉంది. ఐపీఎల్ కంటే విలువ పరంగా కూడా ఎన్నో రెట్లు అధికమైన ఎన్బీఏ లో ఆడటమే వరంగా భావిస్తారు అక్కడి బాస్కెట్ బాల్ ఆటగాళ్లు. అలాంటి లీగ్ లో ఓ జట్టుకు భారత సంతతికి చెందిన మహిళ కోచ్ గా నియమితురాలైంది. ఎన్బీఏ లో Memphis Grizzlies జట్టుకు ఆమె అసిస్టెంట్ కోచ్ గా ఎంపికైంది.
బోస్టన్ కు చెందిన సోనియా రామన్.. మెంఫిస్ గ్రిజ్లీస్ కు అసిస్టెంట్ కోచ్ గా నియామకం కాకముందు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) మహిళా బాస్కెట్ బాల్ జట్టుకు కోచ్ గా పనిచేసేది. 2018, 19 లలో ఆమె మిట్ జట్టుకు ఊహించని విజయాలు అందించింది. దీంతో ఆమె ప్రతిభను గుర్తించిన మెంఫిస్.. రామన్ ను తమతో చేర్చుకుంది.
ప్రస్తుతం మెంఫిస్ గ్రిజ్లిస్ కు టేలర్ జెన్కిన్స్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు సహాయక కోచ్ గా రామన్ ఉండనుంది. ఈ ఏడాది నవంబర్ నుంచి ఆమె ఎన్బీఏలో భాగం కానుంది.
ఎవరీ రామన్..?
సోనియా తండ్రిది చెన్నై. ఆమె తల్లిది నాగ్పూర్. ఈ ఇద్దరూ కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె బాస్కెట్ బాల్ కోచింగ్ ప్రయాణం కూడా ఆసక్తికరమే. సోనియా చదువుకుంది లా. వృత్తిరిత్యా ఆమె న్యాయవాది పట్టా ఉన్నా తనకు ఇష్టమైన బాస్కెట్ బాల్ కోసం దానిని వదిలేసింది.
మూడో భారత సంతతి, తొలి మహిళా కోచ్..
మెంఫిస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా నియమితురాలవడంతో ఆమె ఈ లీగ్ లో కోచ్ బాధ్యతలు చేపట్టిన మూడో భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కింది. అంతకుముందు విన్ బావ్నని (Sacramento Kings జట్టుకు), రాయ్ రానా (Sacramento Kings జట్టుకు) కోచ్ లుగా ఎంపికయ్యారు. అయితే మహిళల కోటాలో మాత్రం సోనియా రామన్ ప్రథమురాలు. మొత్తంగా చూసుకుంటే ఎన్బీఏ చరిత్రలో ఆమె 14వ మహిళా కోచ్.
తనను ఎన్బీఏలో అసిస్టెంట్ కోచ్ గా నియమించడంపై రామన్ స్పందిస్తూ.. ‘మెంఫిస్ కు కృతజ్ఞతలు. ఈ జట్టులో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ ప్రయాణంలో మిట్ కు కూడా క్రెడిట్ దక్కుతుంది’ అని తెలిపింది.