KTR: జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ ఆకుల శ్రీజను అభినందించిన కేటీఆర్
KTR Congratulates Akula Sreeja: తెలుగు రాష్ట్రాలకు అందని ద్రాక్షగా ఉన్న జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ ను దక్కించుకున్న హైదరాబాద్ టీటీ క్రీడాకారిణి ఆకుల శ్రీజను తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు.
కొన్నాళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిలకడగా రాణిస్తూ ఇటీవలే షిల్లాంగ్ లో ముగిసిన జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గెలిచిన హైదరాబాద్ టీటీ క్రీడాకారిని ఆకుల శ్రీజను తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్ అభినందించారు.. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కేటీఆర్ ను కలిసిన శ్రీజతో పాటు ఆమె కోచ్ సోమనాథ్ ఘోష్ ను కూడా ఆయన అభినందించారు. శ్రీజ మరిన్ని పతకాలు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
గత నెల 25న షిల్లాంగ్ లో ముగిసిన జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ ఫైనల్స్ లో శ్రీజ.. 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్ స్టార్ ప్లేయర్, మౌమా దాస్‌పై విజయం సాధించింది.
బెంగాల్ కు చెందిన మౌమా దాస్.. ఈ ఆటలో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అంతేగాక 17 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ లో పోటీ పడ్డ భారత, ఆసియా క్రీడాకారిణిగా నిలిచింది. కానీ ఆకుల శ్రీజ.. ఫైనల్ లో ఆమెను ఓడించి విజేతగా నిలవడం గమనార్హం. హైదరాబాద్ లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీజ.. ఈ ఈవెంట్ లో ఆర్బీఐ తరఫున బరిలోకి దిగింది.
ఈ విజయంతో శ్రీజ.. జాతీయ సీనియర్ టీటీ ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి తెలంగాణ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. గతంలో హైదరాబాద్ కు చెందిన సయూద్ సుల్తానా ఆరు సార్లు (1949, 1950, 1951, 1952, 1953, 1955) ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత సుల్తానా కుటుంబం హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ కు వలసవెళ్లింది. కాగా పురుషుల సింగిల్స్ లో హైదరాబాద్ కు చెందిన మీర్ ఖాసిమ్ అలీ రెండు సార్లు (1968, 1969) లో ఛాంపియన్ అయ్యాడు. ఆ తర్వాత టీటీ ఛాంపియన్షిప్ సాధించడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే ప్రథమం.
కాగా.. శ్రీజను అభినందించిన కేటీఆర్.. ఆమె త్వరలో ఆమె పాల్గొనబోయే పోటీలలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రెటరీ ప్రకాశ్ రాజ్ లు పాల్గొన్నారు. శ్రీజ.. త్వరలో బర్మింగ్ హోమ్ (ఇంగ్లాండ్) లో జరుగబోయే కామన్వెల్త్ పోటీలలో పాల్గొననుంది.