Arif Khan: బారాముల్లా టు బీజింగ్.. వింటర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన కాశ్మీరీ స్కైయ్యర్..
Beijing Winter Olympics: చిన్నప్పుడు తండ్రితో పాటు పర్వతాల దగ్గరకు వెళ్లిన ఆ అబ్బాయి.. ఇప్పుడు దేశం తరఫున ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. నాన్నతో కలిసి గైడ్ గా వెళ్లిన ఆ కుర్రాడు.. అల్ఫైన్ స్కైయింగ్ లో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నాడు.
పర్వతారోహణ అంటే మాములు విషయం కాదు. గడ్డ కట్టే చలిలో.. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలలో ప్రత్యర్థుల కంటే వాతావరణంతోనే పోరాడుతూ సాగాలి. శరీరం మన అధీనంలో ఉండదు. అనువైన పరిస్థితులు కావు. అయినా లక్ష్యాన్ని సాధించాలి. సాధారణంగా పర్వతాలను ఎక్కడానికే ఇంత ఆలోచిస్తే ఇక అలాంటిది పోటీలలో పాల్గనాలంటే ఎంత గట్స్ ఉండాలి..? కాశ్మీర్ కు చెందిన ఓ స్కైయ్యర్.. (పర్వతారోహకుడు) ఈ భయాలన్నింటినీ దాటుకుని, కష్టాలను అధిగమించి వచ్చే ఏడాది బీజింగ్ లో జరిగే శీతాకాల ఒలింపిక్స్ (Beijing Winter Olympics) లో భారత్ (India)కు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. అతడి పేరు మహ్మద్ అరిఫ్ ఖాన్ (Mohammad Arif Khan).
అరిఫ్ స్వస్థలం కాశ్మీర్ లోని నిత్య కల్లోలిత ప్రాంతమైన బారాముల్లా (Baramulla) జిల్లాలోని తంగ్మార్గ్ ఏరియా. అరిఫ్ తండ్రి యాసిన్ ఖాన్.. ఆయన గతంలో కాశ్మీర్ అందాలను చూడటానికి వచ్చే వారికి గైడ్ గా ఉండేవాడు. యాసిన్ ప్రేరణతో అరిఫ్ కూడా పర్వతారోహణను హాబీగా మార్చుకున్నాడు. హాబీ గా మొదలైన తన ప్రయాణం.. కెరీర్ గా కూడా మారింది. పదేండ్ల వయసులోనే అతడు.. అల్ఫైన్ స్కైయింగ్ పై పట్టు సాధించాడు. 12 ఏండ్లకే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నాడు.
2005 లో నిర్వహించిన అల్ఫైన్ స్కైయింగ్ జాతీయ పోటీలలో పాల్గొన్న అరిఫ్.. తొలి స్థానంలో నిలిచాడు. 2008 వరకు దేశంలో ఈ పోటీలలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడే తాను ఒలింపిక్స్ లో పాల్గొనాలని అరిఫ్ ఖాన్ అనుకున్నాడట. ఆ మేరకు 2018 వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొనాలని ట్రై చేసినా అతడి దగ్గర సరిపడా నగదు లేక ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడు.
16 ఏండ్ల వయసులోన జూనియర్ నేషనల్ సై ఫెడరేషన్ ఈవెంట్ లో పాల్గొన్న అరిఫ్.. 2011 లో జరిగిన సౌత్ ఏషియన్ వింటర్ గేమ్స్ లో రెండు విభాగాల్లో (slalom, giant sloalom) రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు.
ఇటీవల ప్రదర్శనతో ర్యాంకును మెరుగుపరుచుకున్న అరిఫ్.. 2022 ఫిబ్రవరిలో జరిగే వింటర్ ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఈవెంట్ (alpine skiing) లో క్వాలిఫై అయిన ఒకే ఒక్క భారతీయుడు అతడే. హిమాన్షు ఠాకూర్, ఆంచల్ ఠాకూర్ లు క్వాలిఫై అవడానికి ప్రయత్నాలు చేసినా వాళ్లు విజయవంతం కాలేదు.
కాగా.. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంపై అరిఫ్ ఖాన్ స్పందించాడు. ‘ఇండియాలో సుమారుగా 50 లక్షల మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3 వేల కిలోమీటర్లు పైన ఉండే మేము చాలా కష్టాలను అధిగమించి బతుకుతున్నాం. ఇక ఈ ఆటకు సంబంధించి మాకు కనీస సదుపాయాలు అందుబాటులో లేవు. మన దేశంలో ఈ ఆట ఆడాలనుకునే ఎంతో మంది క్రీడాకారులు సరైన సౌకర్యాలు లేక విదేశాల బాట పడుతున్నారు..’ అని తెలిపాడు. ప్రభుత్వం కాస్త ప్రోత్సహకాలు అందిస్తే తాము కూడా విజయవంతమవుతామని అరిఫ్ అన్నాడు.