కాశ్మీర్‌లో కొత్త ఆశలు పూయిస్తున్న హాకీ.. యువతకు ఇప్పుడిదే కొత్త కెరీర్
Hockey in Kashmir: ఒకప్పుడు నిత్యం బాంబు దాడులతో తుపాకీ మోతలతో బంద్‌లు, ఆందోళనలతో అట్టుడికిన ప్రాంతం ఇప్పుడు హాకీ స్టిక్ లతో ఆహ్లాదకరంగా మారుతోంది.
శ్రీనగర్ కు చెందిన 25 ఏండ్ల యువతి ఇనాయత్ గత కొన్నిరోజులుగా ఉదయం తన తల్లిదండ్రులు లేవకముందే నిద్రలేచి స్పోర్ట్స్ ట్రాక్ వేసుకుని.. రాత్రంతా తన పక్కనే పెట్టుకుని పడుకున్న హాకీ స్టిక్ తీసుకుని సంతోషంగా గ్రౌండ్ కు పయనమవుతోంది. భారత జాతీయ హకీ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్న ఇనాయత్.. ఏదో ఒకరోజు భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకుంది. మారుతున్న కాశ్మీరానికి ఇదొక శుభసంకేతం. కొన్నేండ్ల క్రితం కాశ్మీరానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఇదొక నిదర్శనం.
నిత్యం బాంబు చప్పుళ్లు.. తుపాకీ మోతలు, ఆందోళనలతో, కర్ఫ్యూలతో అట్టుడికిన ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన చట్ట సవరణ (ఆర్టికల్ 370 రద్దు)లతో మార్పులు కనిపిస్తున్నాయి. పర్యాటకంగా గతంలో కంటే కాశ్మీర్ కు టూరిస్టులు పెరిగాయని నివేదికలు సూచిస్తుండగా.. మిగిలిన విభాగాలతో పాటు క్రీడల్లో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పెరుగుతున్న సౌకర్యాలు..
భారత్ లో క్రికెట్ కంటే ముందే క్రేజ్ సంపాదించుకున్న హాకీ ఆట ఇప్పుడ కాశ్మీర్ యువతలో భాగమైంది. విస్తరిస్తున్న అధునాతన సదుపాయాలు, పెరుగుతున్న సౌకర్యాలతో సుందర కాశ్మీర్ యువత.. ఈ క్రీడను తమ కెరీర్ గా ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో జమ్మూ కాశ్మీర్ నుంచి క్రీడాకారులు లేక పక్క రాష్ట్రాల నుంచి హాకీ ప్లేయర్లను తీసుకొచ్చి ఆడించే వారు. కానీ ఇప్పుడు ఆ బెంగ లేదు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)గా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో 40కి మించిన ప్రొఫెషనల్ హాకీ క్లబ్స్, వందలాది క్రీడాకారులు అవకాశాల కోసం ఆవురావురుమంటూ వేచి చూస్తున్నారు. గతంలో హాకీ గురించి పేపర్లు, టీవీలలో మాత్రమే చూసిన ఇక్కడి యువత ఇప్పుడు అధునాతన అస్ట్రో టర్ఫ్ మైదానాలలో హాకీ ఆడుతున్నది.
ఇప్పుడు హాకీ మా ఫేవరేట్ గేమ్ : ఇనాయత్
జమ్మూకాశ్మీర్ తరఫున రాష్ట్రస్థాయిలో పలు మ్యాచ్ లు ఆడిన ఇనాయత్ ప్రస్తుతం అక్కడి హకీ పరిస్థితుల గురించి వివరిస్తూ.. ‘గతంలో ఇక్కడ హాకీ ఆడేందుకు కావాల్సిన సదుపాయాలు ఉండేవి కావు. జమ్మూకాశ్మీర్ టీమ్ ఆటగాళ్లు కూడా దాదాపుగా బయటివారే ఉండేది. కానీ గ్రౌండ్స్, కోచింగ్ సిబ్బంది, హాకీ క్లబ్స్ పెరుగుదలతో కాశ్మీర్ యువతలో దీనిపై క్రేజ్ పెరిగిపోయింది. యువకులతో పాటు యువతులు కూడా ఈ క్రీడను తమ కెరీర్ గా ఎంచుకున్నారు’అని చెప్పింది.
మేమూ భాగమవుతాం : రాజీవ్ కుమార్, జమ్మూకాశ్మీర్ హాకీ ప్రెసిడెంట్
ప్రస్తుతం శ్రీనగర్ లోని పోలో గ్రౌండ్ ను అస్ట్రో టర్ఫ్ మైదానంగా మార్చగా ఎక్కువమంది ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. త్వరలోనే శ్రీనగర్ లో ఉన్న అమర్ సింగ్ కాలేజీలో కూడా ఇదే తరహా గ్రౌండ్ ను తయారుచేసేందుకు హాకీ అసోసియేషన్ సన్నాహకాలు చేస్తున్నది. ఇదే విషయమై జమ్మూ కాశ్మీర్ హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. ‘భారతదేశ వారసత్వంలో హాకీ భాగంగా ఉంది. ఈ క్రీడలో భారత్ విశ్వవేదికపై అనేకపతకాలు గెలిచింది. కానీ జమ్మూకాశ్మీర్ నుంచి మా ప్రాతినిథ్యం చాలా తక్కువ. మేము ఈ లోటును పూర్తి చేస్తాం..’అని అంటున్నాడు.
హాకీలోనే కాదు.. క్రికెట్ లోనూ..
ఒకప్పుడు జమ్మూకాశ్మీర్ నుంచి భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులను భూతద్దం వేసినా దొరికేవారు కాదు. కానీ గడిచిన కొన్నాళ్లుగా ఆ బెంగ తీరుతోంది. బాంబులు, తుపాకులకు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకున్న యువత తమ కెరీర్ లుగా క్రీడలను ఎంచుకుంటున్నది. ఒకప్పుడు భారత క్రికెట్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ప్లేయర్ ను తీసుకురావాలంటే అది శక్తికి మించినపనే. కానీ నేడు భారత్ లోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వేగవంతమైన బౌలర్ గా రికార్డులు బద్దలుకొడుతున్న ఉమ్రాన్ మాలిక్.. జమ్మూ కుర్రాడే. ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఆడుతున్న అబ్దుల్ సమద్ కూడా ఈ ప్రాంతానికి చెందినవాడే. మరికొందరు బౌలర్లు కూడా దేశవాళీలో తమ ఆటతో రాణిస్తున్నారు.