భారత్‌లో క్రికెట్ ఒక మతంగా.. క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధించడానికి అసలు కారణం.. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని భారతజట్టు వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడమే. ఆ సంఘటన దేశంలో క్రికెట్ రూపురేఖల్నే మార్చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విజయం వెనుక కీలకపాత్ర పోషించిన వ్యక్తి కపిల్ దేవ్. బౌలర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కపిల్ చూపిన ఆల్‌రౌండ్ ప్రతిభ భారత్‌ను విశ్వవిజేతను చేసింది. అలాంటి వ్యక్తికి 36 ఏళ్ల తర్వాత జీతం వస్తే..

1978లో కపిల్‌దేవ్ టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ప్రదర్శనకు మెచ్చి 1979లో మోడీ స్పిన్నింగ్ అండ్ వేవింగ్ కంపెనీ కపిల్‌ దేవ్‌కు తమ సంస్థలో ఉద్యోగం ఇచ్చింది. 1979 నుంచి 1982 వరకు కపిల్ ఆ సంస్థలోనే ఉద్యోగం చేశాడు. అయితే ఆ సమయంలో కపిల్‌ కొన్ని నెలలకు మాత్రమే జీతాన్ని అందుకున్నారు.

మిగిలిన జీతభత్యాలతో పాటు పీఎఫ్ కూడా పెండింగ్‌లో పడిపోవడంతో ఆ మొత్తాన్ని కంపెనీ సెటిల్ చేసింది.  తాజాగా ఆ సంస్థ యాజమాన్యం దీనిపై స్పందించింది. ఆయనకు ఇవ్వవలసిన రూ.2.75 లక్షలను కపిల్ ఖాతాకు జమచేసినట్లు కంపెనీ తెలిపింది.